ఖమ్మం, మే 8: ధాన్యం దిగుమతి, తరగు విషయంలో మిల్లర్లు తమ పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో ధాన్యం, మొకజొన్న సేకరణ ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం, మక్కలల సేకరణ, రవాణా తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు, మిల్లర్లు, లారీ ఓనర్స్ అసోసియేషన్ బాధ్యులు, పీఏసీఎస్‌ల చైర్మన్లతో ఖమ్మంలోని ఐడీవోసీలో సోమవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు కాగా దాదాపు 2 లక్షలకు పైచిలుకు ధాన్యం సేకరణ కేంద్రాలకు రానుందని అన్నారు. ఇప్పటి వరకు కేవలం 40 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించినట్లు అధికారుల లెకలు చెబుతున్నాయన్నారు. ధాన్యం సేకరణలో బాగా వెనుకబడి ఉన్నామని, ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఎప్పుడూ లేదని అన్నారు. మిల్లర్లు కొత్త కొత్త పాలసీలను జిల్లాలో మోపి రైతులను ఇబ్బందులు పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వంతో ఉన్న సమస్యలను రైతులపై రుద్ది వాళ్లని ఇబ్బంది పెట్టాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా క్లిష్ట సమయంలోనే 3 లక్షల పై చిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇప్పుడు దాన్ని అందుకోలేకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. మిల్లర్లు తరుగు పేరుతో 4 కిలోలు తీసేయడం సరికాదని అన్నారు. ధాన్యం రవాణాలో అవాంతరాలు కలిగిస్తే చర్యలకు వెనుకాడేది లేదని అన్నారు. ఇప్పటికైనా పనితీరు మార్చుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతు పండించిన చివరి గింజను మద్దతు ధరతో కొనాలన్నదే ప్రభుత్వ ఆశయమని అన్నారు. తడిసిన ధాన్యం మొత్తాన్నీ సేకరిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. మండలానికి ఒకటి చొప్పున మొకజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో 236 ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించి.. 232 కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు.
130 కేంద్రాల ద్వారా 4,220 మంది రైతుల నుంచి 40,477.520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకు సేకరించినట్లు తెలిపారు. తడిసిన ధాన్యం సేకరణకు 9 పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు ట్యాగ్ చేసినట్లు చెప్పారు. జిల్లాలో 41 మొకజొన్న సేకరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రక్రియలో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. టీఎస్ సీడ్స్, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషణం, రాయల వెంకట శేషగిరిరావు, సీపీ విష్ణు వారియర్, అదనపు కలెక్టర్ మధుసూదన్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు, వివిధ శాఖల అధికారులు విద్యాచందన, విజయకుమారి, తోట కిషన్ రావు, రాజేందర్, సోములు, నాగరాజు, సునీత, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు భద్రం, సత్యం బాబు పాల్గొన్నారు.