ఖమ్మం, నవంబర్ 24: నియోజకవర్గ ప్రజలు మరో అవకాశమిస్తే ఖమ్మాన్ని పెద్ద నగరాల మాదిరిగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం రూపురేఖలను మరింతగా తీర్చిదిద్ది అగ్రభాగాన నిలుపుతానని మాట ఇచ్చారు. ఖమ్మం నగరంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. 49వ డివిజన్‌తోపాటు మరికొన్ని డివిజన్లలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఇంకొన్ని డివిజన్లలో రోడ్‌షోలు నిర్వహించారు. మరికొన్ని ప్రాంతాల్లో పలు సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు హాజరయ్యారు. తొలుత ఖమ్మం 49వ డివిజన్ మామిళ్లగూడెంలో జరిగిన ప్రచారంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి నమూనా బ్యాలెట్‌ను చూపిస్తూ ప్రచారం చేశారు. మొదటి బ్యాలెట్‌లోని మొదటి సంఖ్యలో ఉన్న కారు గుర్తుపై ఓటు వేసి తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మాన్ని ఇప్పటికే ప్రశాంత నగరంగా, పర్యాటక నగరంగా తీర్చిదిద్దానని గుర్తుచేశారు.
ఈ ఎన్నికల్లో కూడా తనను అధిక మెజార్టీతో తనకు విజయాన్ని అందిస్తే ఖమ్మం శోభ మరింత విరాజిల్లేలా అభివృద్ధి చేస్తానని అన్నారు. పదేళ్ల క్రితం ఖమ్మం మున్సిపాలిటీ చెత్త సేకరణ అస్తవ్యస్తంగా ఉండేదని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తాను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా అయ్యాక కొత్త విధానాలు తీసుకొచ్చానని అన్నారు. సాంకేతికతను జోడించి చెత్తను సేకరిస్తుండడంతో డివిజన్ల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తాను ప్రచారానికి వెళ్లి ప్రతిచోటా ఇదే విషయాన్ని తనకు గుర్తుచేస్తున్నారని వివరించారు. అందుకని ఇక్కడి నుంచి తనను మరోసారి గెలిపించాలని, కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు మన్నే వెంకటరమణ, మేడి పవన్‌కుమార్, పొన్నం వెంకటేశ్వర్లు, ఊటుకూరి రవికాంత్, మన్నే శేషారత్నం, నల్లమోతు కోటేశ్వరరావు, శాబాసు శ్రీనివాస్‌రావు, పర్సా రంగారావు, గుండా కోటేశ్వరరావు, కే.రంగాచారి, వేముల సుధీర్, జమలాపురం కేశవరావు, కిషన్‌రావు, వేణుగోపాల్, శ్రీనివాస్, నజీర్, పొన్నం వినేశ్, బాషా, దాక్షయిని, గోళ్ల రాధాకృష్ణ, షకీనా పాల్గొన్నారు.