ఖమ్మం, ఏప్రిల్ 14 : అంబేద్కర్ దేశ ప్రజలకు అందించిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్, తోటి మంత్రులతో కలిసి 125 అడుగుల అంబేదర్ విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ మహోజ్వల ఘట్టంలో పాల్గొనడం తనకు ఆనందాన్నిచ్చిందని మీడియాకు వెల్లడించారు. అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి అసమాన్యవ్యక్తిగా అంబేద్కర్ ఎదిగిన తీరును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ప్రజలకు అసమానతలు లేని పాలన అందించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారన్నారు. ఆయన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించారన్నారు. ఎస్సీల సంక్షేమం కోసం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. అంబేద్కర్ సేవలకు గుర్తుగా కేసీఆర్ సచివాలయానికి ‘అంబేద్కర్’ నామకరణం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంబేద్కర్ పేరుపై ఏటా అవార్డ్ ఇచ్చేందుకు రూ.51 కోట్లను బ్యాంక్‌లో స్థిరీకరిస్తామని ప్రకటించారన్నారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌కూ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.