కూసుమంచి, జూలై 28 : రాష్ట్రంలో పేదల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో సుమారు రూ.2.5 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న కిష్టాపురం- తురకగూడెం, తురకగూడెం- చితల్తండా రహదారుల నిర్మాణాలకు, పాలేరులో సైడ్డ్రైన్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులను నాణ్యతతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు రుణమాఫీ విషయంలో విపక్షాల విమర్శలు అర్థంలేనివన్నారు. కూసుమంచిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 37మందికి రూ.8.16 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పం పిణీ చేశారు. సీనియర్ కాం గ్రెస్ నాయకుడు నాగడ్ల నర్సింహారావు అనారోగ్యంతో మృతిచెందడంతో ఆదివారం జుజ్జుల్రావుపేటలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.