రామవరం, ఆగస్టు 12 : మైనింగ్ కార్యకలాపాలను విస్తరించే విషయంలోనూ, నిర్వాసితులకు న్యాయం చేసే అంశంలోనూ సింగరేణి సంస్థ ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తుంటుంది. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆమోదం తీసుకున్న తరువాతే ముందుకు సాగుతూ ఉంటుంది. నిర్వాసితులకు తగిన ఉపాధి కల్పిస్తూ, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల విశ్వాసం పొందుతూ ఉంటుంది. కానీ.. తాజాగా కొందరు ఉద్యోగులు, ఇతరుల కారణంగా చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు సంస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. ఎస్అండ్పీసీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల నియామకం విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని సంస్థ ఆస్తులను కాపాడేందుకు, ఉద్యోగులకు రక్షణగా ఉండేందుకు ఎస్అండ్పీసీ ద్వారా ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల నియామకం కూడా చేపడుతారు. టెండరు దక్కించుకున్న సెక్యూరిటీ ఏజెన్సీ.. ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల నియామకాలను చేపడుతుంది. ఈ నియామకాల్లో భాగంగా ఇటీవల 18 పోస్టులకు గాను.. 26 మందిని(స్టాండింగ్ కోసం ఎక్కువ మందిని తీసుకుంటారు) ఎంపిక చేశారు. అయితే ఇలాంటి ఎంపికల కోసం గతంలో నోటిఫికేషన్ ఇచ్చేవారు.
ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలోగానీ లేదా ప్రగతి వనంలోగానీ సింగరేణి అధికారుల పర్యవేక్షణలో అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేవారు. ఈ ప్రక్రియనంతా పూర్తి పారదర్శకంగా చేపట్టేవారు. కానీ.. ఇటీవలి అంశంలో నోటిఫికేషన్ లేకుండానే నియామకాలు చేపట్టారు. 5 షాఫ్టుకు వెళ్లే దారిలో గుట్టుచప్పుడు కాకుండా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ అంశాలు ప్రభావిత ప్రాంతాల్లోని నిర్వాసితుల్లో అనేక అనుమానాలను పెంచుతున్నాయి. అయితే ఈ నియామకాల్లో స్థానిక ప్రజాప్రతినిధికి 17 పోస్టులు, వైరా ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధికి 5 పోస్టులు, స్థానిక నాయకులకు మిగతా పోస్టులను కేటాయించినట్లు విశ్వసనీయమైన సమాచారం.
ఇందులోనూ ఒకే సామాజికవర్గం వారికి పెద్దపీట వేసినట్లు ఆరోపణలున్నాయి. అదీగాక ఎస్అండ్పీసీలో పనిచేసే ఆ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఈ సెక్యూరిటీ ఏజెన్సీని ప్రభావితం చేస్తున్నాడని, తద్వారా తాను కూడా లబ్ధిపొందుతున్నాడని ఆరోపణలున్నాయి. అయితే ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులే తమ కోటాల పేరిట ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, తమ అనుయాయులకే ఉద్యోగాలిప్పిస్తూ వారినే అందలం ఎక్కిస్తున్నారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు.
ఎస్అండ్పీసీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నియామకాల్లో ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతోంది. గతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. అయినా ఉపయోగం లేకుండా పోతోంది. గతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేవారు. ప్రభావిత ప్రాంతాల యువతకు మాత్రమే అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు జరుగుతున్న నియామకాల్లో ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువత లేనేలేదు. అందరూ ఇతర ప్రాంతాల వాళ్లే.
-గుమ్మడి సాగర్, మాజీ సర్పంచ్, రుద్రంపూర్
ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రతిసారీ మొండిచేయే చూపుతున్నారు. ఇక్కడి ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో చెబుతున్న అధికారులు.. ఆ తరువాత మా అభిప్రాయాలను పట్టించుకోవడమే లేదు. మా తండా నుంచి ఐదుగురికి అవకాశమివ్వాలని గతంలో అధికారులను అనేకసార్లు అభ్యర్థించాం. కాలయాపనే తప్ప ప్రయోజనం కన్పించలేదు. ప్రభావిత గ్రామాలకు సంబంధం లేనివారే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు.
-బానోత్ రాందాస్, మాజీ సర్పంచ్, ధన్బాద్