పంజాబ్ రైస్ (పీఆర్) రకం వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. భద్రాద్రి జిల్లాలో, ముఖ్యంగా చుంచుపల్లి మండలంలో చర్చనీయాంశమవుతోంది. పీఆర్ రకం ధాన్యానికి తరుగు తీయాలనే నిబంధన, అది కూడా పది కేజీల చొప్పున తీయాలనే నిబంధన ఎకడా లేదు. అయినప్పటికీ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ(ఎఫ్ఏక్యూ) నిబంధన పేరుతో అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
-చుంచుపల్లి, మే 16
చుంచుపల్లి మండలంలోని రాంపురం, చుంచుపల్లితండా ప్రాంతాల రైతులు సుమారు 450 ఎకరాల్లో పీఆర్ రకానికి చెందిన వరి పంట సాగు చేశారు. దాదాపు 12,500 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. దీనిని సదరు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లారు. మరికొందరు కల్లాల్లోనూ ఉంచారు. అయితే, ఈ ధాన్యాన్ని అమ్ముకునేందుకు సదరు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ధాన్యానికి బోనస్ రాదని అధికారులు చెబుతుండడంతో.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్లి రైతులు తలలు పట్టుకుంటున్నారు.
కేవలం సన్నరకాలకు మాత్రమే ప్రభుత్వం రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిందని, కానీ.. ఇలాంటి పీఆర్ రకాలకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పలేదని అధికారులు అంటుండడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు మోసంపై లబోదిబోమంటున్నారు. పీఆర్ రకాలను వేయొద్దని ముందే చెబితే తాము ఈ రకాలను సాగు చేసేవాళ్లమే కాదని నెత్తీనోరూ బాదుకుంటున్నారు. చెమటోడ్చి పంట పండించి ధాన్యాన్ని విక్రయానికి తీసుకొచ్చాక ఇప్పుడు ‘పీఆర్ రకాలను కొనుగోలు చేయం’ అంటూ ప్రభుత్వం చెబుతుంటే తామే కావాలంటూ, తమ కష్టమేం కావాలంటూ గుండెలు బాదుకుంటున్నారు.
పైగా, పది కిలోల తరుగు..
అసలు, పీఆర్ రకం ధాన్యంలో పిన్‌పాయింట్ డ్యామేజ్(గింజ చివరి ముక్క విరిగిపోవడం) ఎక్కువగా జరుగుతోందని, అందుకే ఆ రకం ధాన్యాన్ని తాము కొనబోమని మిల్లర్లు చెబుతున్నారు. ఒకవేళ కొనుగోలు చేసినా.. క్వింటాకు పది కేజీల చొప్పున తరుగు తీస్తామంటూ కొర్రీలు పెడుతున్నారు. చేసేదేమీ లేక చివరికి చాలామంది రైతులు పది కేజీల తరుగు ఇచ్చి మరీ తమ పంటను తెగనమ్ముకుంటున్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోతాయేమోనని ఆందోళనతో తరుగు ఎక్కువైనా అమ్ముకునేందుకే మొగ్గు చూపుతున్నారు.
ప్రతి ధాన్యం గింజనూ కొంటాం
భద్రాద్రి కొత్తగూడెం, మే 16 (నమస్తే తెలంగాణ) : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన 167 కొనుగోలు కేంద్రాలకు 167 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి జాప్యం చోటుచేసుకోకుండా ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు, హమాలీలు, రవాణా సదుపాయాలు తదితర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 94,198 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరపగా.. సుమారు 2,44,915 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేసినట్లు తెలిపారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే సంబంధిత ప్రత్యేక అధికారులకుగానీ, జిల్లా అధికారులకుగానీ సమాచారం అందించాలని కోరారు.
గోదాముకు పోటెత్తిన మక్కలు
వేంసూరు, మే 16 : మొకజొన్నల దిగుమతుల విషయంలో మండలంలోని కల్లూరుగూడెం గోదాము వద్ద రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి వందలాది ట్రాక్టర్లు, లారీలతో పది రోజులుగా మకలు ఈ గోదాముకు వస్తున్నాయి. కానీ, ఇక్కడ సరైన పర్యవేక్షణ, వసతులు లేక రైతులు, వాహనాల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు రోజుల తరబడి వెయిటింగ్లో ఉండడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. వెయిటింగ్ చార్జీలు పెరుగుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదాము వద్దే రోజుల తరబడి నిరీక్షిస్తున్న డ్రైవర్లకు కనీసం నీడ, తాగునీరు, భోజనం వంటి సౌకర్యాలు కూడా లేవు. అదీగాక.. అన్ని పత్రాలు, వే బిల్లులు ఉన్న వాహనాలను అధికారులు పకనబెడుతున్నారు.
వే బిల్లులు లేని వాహనాల్లోని మక్కలను మాత్రం త్వరితగతిన దిగుమతి చేస్తున్నారు. ఈ విషయంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదాము సిబ్బంది, కొంతమంది అధికారులు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా దిగుమతులు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. కాగా, హమాలీల కొరతతో రైతులే స్వయంగా ట్రాక్టర్ల నుంచి తమ మకల బస్తాలను దింపుకుంటున్నారు. ఈ క్రమంలో రైతులు, గోదాము సిబ్బంది మధ్య శనివారం వాగ్వాదం చోటుచేసుకుంది. తహసీల్దార్ మాణిక్‌రావు జోక్యం చేసుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఏఎస్సై నాగేశ్వరరావు పర్యవేక్షణలో దిగుమతులు కొనసాగుతున్నాయి.
15 రోజులుగా ఇక్కడే ఉంటున్నా..
పీఆర్ 126 ధాన్యం రకం వరిని ఆరు ఎకరాల్లో, సన్నాలను మరో ఆరు ఎకరాల్లో సాగు చేశారు. చేతికొచ్చిన ధాన్యాన్ని రాంపురం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాను. తుర్పారపట్టి ఆరబెట్టాను. విక్రయించేందుకు 15 రోజులుగా ఇక్కడే ఉంటున్నా. అధికారులు ఇంకా కాంటా పెట్టడం లేదు. ఎప్పుడు పెడతారో కూడా చెప్పడం లేదు. వర్షం వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. అయితే, సన్నాలకు 5, పీఆర్‌లకు10 కేజీల చొప్పున అధికారులు తరుగు తీస్తున్నారని ఇక్కడి రైతులు అంటున్నారు. అలా తీస్తే మాకు మిగిలేది ఏముంటుంది.?
-కట్టా నరసింహారావు, రైతు, రాంపురం
పది కేజీల తరుగు అంటున్నారు..
ఇక్కడ పది కేజీల చొప్పున తరుగు తీస్తున్నారని తోటి రైతులు అంటున్నారు. మరీ దారుణంగా పది కేజీల తరుగు తీస్తే ఇక మాకేం ఉంటుంది. మా కష్టంలో చాలా వరకూ పోతుంది. ఎంతో కష్టపడి పంట పండించాం. ఎంతో శ్రమకోర్చి ఇక్కడిదాకా పంటను తీసుకొచ్చాం. ఇప్పుడేమో ఇక్కడ అకాల వర్షాలు కురిసేలా ఉన్నాయి. వ్యవసాయ అధికారులు ఎఫ్ఏక్యూ విధానం పేరుతో జాప్యం చేస్తూ మా ధాన్యాన్ని కాంటా పెట్టడం లేదు.
-చింతా వెంకటేశ్,రైతు, రాంపురం
ఇంతటి తరుగుతో మాకు చాలా నష్టం..
నేను 13 ఎకరాల్లో వరి సాగు చేశా. మొత్తం పీఆర్126 రకం పండించాను. పంటను కోసి ఇక్కడి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చాను. రెండు వారాలుగా ఇక్కడే ఉంటూ ధాన్యాన్ని తూర్పారబడుతూ ఆరబెడుతున్నాను. ఇప్పుడు అధికారులు ఎఫ్ఏక్యూ పద్ధతి పేరిట ఆలస్యం చేస్తున్నారు. పైగా, నిర్ణీత నాణ్యత ప్రకారం ఎఫ్ఏక్యూ రాకపోతే తరుగు తీస్తామని స్పష్టం చేస్తున్నారు. అంతలా తరుగు తీస్తే మాకు చాలా నష్టం వస్తుంది. తరుగు తీయకుండా మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
-కట్ట పుల్లారావు, రైతు, రాంపురం