చర్ల, మే 22 : చర్ల మండలం సుబ్బంపేట, ఎదిర గుట్టలు – ములుగు జిల్లా యాకన్నగూడెంల మధ్య చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు శుక్రవారం నిర్ధారించారు. ఎదిర గుట్టల సమీపంలో భద్రాచలం – వెంకటాపురం ప్రధాన రహదారిపై చిరుత సంచరిస్తున్నట్లు గురువారం రాత్రి కొందరు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో అప్రమత్తమైన వెంకటాపురం, చర్ల రేంజి అటవీ శాఖ అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించేందుకు శుక్రవారం ఉదయం ఎదిర గుట్టలు, యాకన్నగూడెం, సుబ్బంపేట ప్రాంతాలను సందర్శించారు.

రాళ్లవాగు, ఎదిర గుట్టల సమీపంలో చిరుత పాదముద్రలను వెంకటాపురం అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ చిరుత సమీప అటవీ ప్రాంతాల వైపు వెళ్తున్నదని, సుబ్బంపేట, యాకన్నగూడెం గ్రామాల ప్రజలు, పశువులు, గొర్రెల కాపరులు అటవీ ప్రాంతం వైపు వెళ్లొద్దని సూచించారు. రాత్రిపూట చిరుత అరుపులు వినిపించినా, కనిపించినా వెంటనే తమకు సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు కోరారు.