డాక్టర్.. ఇంజినీర్.. కలెక్టర్.. లాయర్.. ఇలా తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ఆ స్థాయికి చేరాలని తల్లిదండ్రులు కలలు కంటుంటారు. పిల్లలు ఎదిగేకొద్దీ లక్ష్యం దిశగా అడుగులు వేసేలా ప్రణాళిక రూపొందించి ఖర్చుకు వెనుకాడకుండా మరీ చదివిస్తున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు డాక్టర్ కావాలనే తపన ఉన్నా ఖర్చుకు భయపడి వెనుకడుగు వేస్తున్నారు. దూర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్లి చదివితే కుటుంబంపై ఆర్థిక భారం పడుతుందనే దిగులుతో తమ లక్ష్యాన్ని మార్చుకుంటున్నారు.
‘ఇక నుంచి అలా జరగొద్దు.. మన పిల్లల చదువులు మన వద్దే’ అంటూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల డాక్టర్ కలలను నిజం చేయాలని.. ప్రజలకు వైద్య సేవలు అందించే భాగ్యాన్ని వారికి కల్పించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులపై భారం పడకుండా జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారు. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల(కేజీఎంసీ)ను సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించి మాట్లాడారు. రానున్న కాలంలో ఏడాదికి 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ వర్ధిల్లుతుందని తెలిపారు. – ఖమ్మం సెప్టెంబర్ 15
మా నాన్న బ్యాంకు ఉద్యోగి. నా చదువంతా తెలంగాణలోనే అయినప్పటికీ ఉద్యోగ రీత్యా వైజాగ్‌లో ఉంటున్నాం. ఇతర రాష్ర్టాల్లో లేదా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న కాలేజీలో సీటు వస్తుందేమో అని భయపడ్డా. కానీ.. ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు రావడం అదృష్టంగాభావిస్తున్నా. కాలేజీలో తరగతి గదులు, ఇతర వసతులు అద్భుతంగా ఉన్నాయి.కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలుతెలుపుకుంటున్న.
-వై.రమ్యప్రియ, విద్యార్థిని
ఖమ్మం సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించామని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మెడికల్ కళాశాలలను నిర్మించి ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల(కేజీఎంసీ)ను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్కళాశాలల ద్వారా మున్ముందు ఏడాదికి 10 వేల మంది డాక్టర్లను తీర్చిదిద్దుతామన్నారు. దేశంలో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. వైద్య విద్యను ప్రోత్సహిస్తూ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న ఏకైక రాష్ట్రమూ తెలంగాణేనన్నారు.
ప్రతి వైద్య కళాశాలలో 85 శాతం సీట్లు రాష్ట్ర యువతకేనన్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు. ఇదే విషయంపై కొందరు హైకోర్టుకు వెళ్లినప్పటికీ విజయం సాధించామన్నారు. అత్యంత ఖరీదైన వైద్య విద్యను సామాన్యులకు అందించాలన్న సంకల్పంతోనే జిల్లాకో కళాశాలను మంజూరు చేశామన్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత డాక్టర్లుగా బయటకు వస్తారని, ఆరోజు సమాజ సేవకు పాటుపడాలని పిలుపునిచ్చారు. నిరుపేద కుటుంబాల వారికి అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, మెడిసిన్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.
రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది మెడికల్ కళాశాలలను సీఎం కేసీఆర్ ప్రారంభించడం వైద్య చరిత్రలో సువర్ణాధ్యాయం అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. తాను ఖమ్మం ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతున్న సమయంలో మెడికల్ కళాశాలను ప్రారంభించుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు. గతంలో పేదింటి పిల్లలు మెడిసిన్ చదవాలంటే ఇబ్బంది పడేవారని, సీఎం కేసీఆర్ కృషితోనే ఇప్పుడు తక్కువ ఖర్చుతోనే మెడిసిన్ చదివే అవకాశం వచ్చిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా జిల్లాకో మెడికల్ కళాశాల ఇస్తామని సీఎం హామీ ఇచ్చి, ఆ హామీని ఆచరణలో నిరూపించారని కొనియాడారు.
ఖమ్మం జిల్లా సార్వజనీన ఆసుపత్రిలో ఇకనుంచి 24 గంటలపాటు నాణ్యమైన వైద్యసేవలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. నూతన మెడికల్ కాలేజీలో సీటు సంపాదించిన విద్యార్థులు మంచి నైఫుణ్యం కలిగిన వైద్యులుగా తయారవ్వాలని సూచించారు. అప్పుడే సీఎం కేసీఆర్ ఆశయం, కన్నవారి కలలు నిజం అవుతాయన్నారు. అడిగిన వెంటనే ఖమ్మానికి మెడికల్ కాలేజీని కేటాయించిన ముఖ్యమంత్రికి, అన్నివిధాలా సహకరించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. దగ్గరుండి సకాలంలో పనులు పూర్తి చేయించిన కలెక్టర్ వీపీ గౌతమ్‌ను మంత్రి అభినందించారు.
ఖమ్మం మెడికల్ కాలేజీ తరగతులను హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన వెంటనే వైద్యాధికారులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ నేపథ్యంలో కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. తెలంగాణతోపాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు మోటివేషన్ నిర్వహించారు. సందర్భంగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్స్ విద్యార్థులకు పరిచయం చేసుకున్నారు.
చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వసతులు కల్పించారని ప్రొఫెసర్లు అన్నారు. తరగతి గదుల్లో ఏసీలు, హాస్టల్స్‌లో ఏసీలు, గీజర్లు, వాషింగ్ మెషిన్స్ వంటివి ఏర్పాటు చేయడం తాము తొలిసారిగా చూస్తున్నామన్నారు. ఇంతగా సహకరించిన సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి విద్యార్థులు, తల్లిదండ్రులు రుణపడి ఉండాలని సూచించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కమల్‌రాజు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మాలతి, డీసీహెచ్ఎస్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ సదానందం, డాక్టర్ సరిత, సూపరింటెండెంట్, డి ప్యూటీ సూపరింటెండెంట్స్ డాక్టర్ ఎల్ కిరణ్, డాక్టర్ బీ కిరణ్, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ పాల్గొన్నారు.