కారేపల్లి, జూలై 26: ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో ఖమ్మం జిల్లా సింగరేణి మండల వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నత అధికారుల ఆదేశాలతో ఆదివారం గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. ఆరోగ్య ప్రాథమిక ఉప కేంద్రాల పరిధిలోని వైద్య సిబ్బంది గ్రామాలలోని ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీలో స్థానిక ఏఎన్ఎంలు అంజలి, కృష్ణవేణి ఆశా కార్యకర్త పద్మతో కలిసి కారేపల్లి క్రాస్ రోడ్, లింగం బంజారా, విశ్వనాధపల్లి, బొక్కల తండా గ్రామాలలో పర్యటించారు.
ఇండ్లలో నిల్వ ఉన్న నీటి తొట్లను, పాత టైర్లను తొలగించారు. ఇంటి ఆవరణలతో పాటు పరిసర ప్రాంతాల్లో లార్వా చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా డెంగ్యూ, మలేరియా చికెన్ గున్యా ఇతర విషపు జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించారు. షుగర్, బిపి వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేశారు. ఈనెల 31 వరకు గ్రామాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అనారోగ్యానికి గురైన వారు వెంటనే స్థానిక సబ్ సెంటర్లు వైద్య సిబ్బంది సంప్రదించాలని కోరారు. ఒకటి, రెండుకు మించి ఎక్కువ జ్వర కేసులు నమోదైతే ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.