భద్రాచలం, జూన్ 13 : ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్సీలలో విధులు నిర్వర్తించే వైద్యుల పూర్తి బాధ్యత మెడికల్ ఆఫీసర్లదేనని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీలోని 29 పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లతో శుక్రవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
గర్భిణులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసి పీహెచ్సీల్లోనే సుఖప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. వర్షాకాలం సీజన్లో సిబ్బంది 24 గంటలూ పీహెచ్సీల్లో అందుబాటులో ఉండాలని, సరిపడా మందుల నిల్వలు ఉండేలా చూసుకోవాలన్నారు. చర్ల, దుమ్ముగూడెం, సింగరేణి, కారేపల్లి మండలాల్లో దోమల ప్రభావంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఏఎన్ఎంలు, ఆశాలు, సూపర్వైజర్లు పంచాయతీ సహకారంతో ఇంటింటికి వెళ్లి దోమల నివారణ మందు పిచికారీ చేయించాలని సూచించారు.
డెంగ్యూ నిర్ధారణ కేసులు నమోదైతే ఆయా గ్రామాల్లో పూర్తిస్థాయి శానిటేషన్ చేయాలని, రోగులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసి మందులు అందించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో చైతన్య, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, వైద్యులు జయలక్ష్మి, మధువరన్, పుల్లారెడ్డి, తేజశ్రీ, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.