కూసుమంచి (నేలకొండపల్లి), ఫిబ్రవరి 14: ‘తక్కువేమి మనకు.. రాముడు ఒక్కడుండు వరకు..’, ‘పలుకే బంగారమాయెనా కోదండపాణి.. కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి..’ అంటూ శ్రీరాముడి అపరభక్తుడు, ప్రముఖ వాగ్గేయకారుడు భక్తరామదాసు కీర్తనలు నేలకొండపల్లిలో మూడోరోజూ మార్మోగాయి. భక్తరామదాసు జయంత్యుత్సవాల్లో భాగంగా నేలకొండపల్లిలోని శ్రీరామదాసు విద్వత్ కళాపీఠంలో మూడు రోజులుగా కొనసాగుతున్న వేడుకలు బుధవారం వైభవంగా ముగిశాయి. ఈ జయంత్యుత్సవాలకు వందలాది మంది కళాకారులు, కవులు, నృత్యకారులు హాజరయ్యారు. వీణనాదం, భరతనాట్యం, కూచిపూడి, సుందరాకాండ వంటి ప్రదర్శనలు కనువిందు చేశాయి. అలాగే రామదాసు కీర్తనలూ వీనులవిందు చేశాయి. శ్రీరామదాసు విద్వత్ కళాపీఠం ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ఉత్సవాలు ఆ వాగ్గేయకారుడి కీర్తిని, శ్రీరాముడిపై ఆయనకు ఉన్న భక్తిని ఇనుమడింపజేశాయి.
రామదాసు జయంత్యుత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాగ్యరాజ సంగీత కళాశాల బాధ్యుల ప్రదర్శనలు, దొడ్డు సీతారామయ్య వీణా కచేరి వంటి కార్యక్రమాలు అలరింపజేశాయి. కౌటూరి గాయత్రి, శిశిశ్రీ, లలితమ్మ శిశ్యుల సంగీతం, వికాస తరంగిణి బాధ్యుల విష్ణు సహస్రనామ పారాయణం, కల్లూరు నిహారిక ఆలపించిన రామదాసు కీర్తనలు, పద్మ ప్రసూన వీణా కచేరి, వై.రమాప్రభ సంగీత కచేరి వంటివి భక్తులను ఓలలాడించాయి. శ్రీరామదాస విద్వత్ కళాపీఠం చైర్మన్ సాధు రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో కళాకారులనురామదాసు మెమెంటోలతో అందజేశారు. నేలకొండపల్లిలోని రామదాసు ధాన్య మందిరంలో భద్రాచల దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక విభాగం, నేలకొండపల్లి భక్తరామదాస విద్వాన్ కళాపీఠం సౌజన్యంతో జయంత్యుత్సవాలు విజయవంతమయ్యాయి.
మేము అనేక ప్రాంతాల్లో కూచిపూడి నాట్యం ప్రదర్శించాం. కానీ వాగ్గేయకారుడు భక్తరామదాసు క్షేత్రంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను కూచిపూడిలో డిప్లొమా చేస్తున్నాను. మా గురువులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ కళను ప్రదర్శిస్తున్నాను. చరిత్ర అనేది కళల్లో ఇమిడి ఉంటుంది. దానిని కాపాడడం కోసం అందరమూ కృషిచేయాలనేదే మా భావన. మన సంస్కృతికి అద్దంపట్టే ఇలాంటి అనేక కళలు ప్రస్తుత సమాజంలో అంతరించి పోతున్నాయి. తల్లిదండ్రులు వాటిని పిల్లలకు నేర్పించి మన సంప్రదాయాలు కాపాడేందుకు ప్రయత్నించాలి. డిగ్రీ చదువుతూనే కూచిపూడి నేర్చుకొంటున్నాను. నేలకొండపల్లిలో ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉంది.
భద్రాచలం, ఫిబ్రవరి 14 : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న భక్త రామదాసు 391వ జయంత్యుత్సవాలు బుధవారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన ఎన్.షణ్ముఖ శర్మ వయోలిన్ నాదం, సారపాకకు చెందిన వెంపటి శ్యామలాదేవి, వాణి, ప్రమీల, నాగమణి, అనూష, హేమలత, నాగలక్ష్మి ఆలపించిన రామదాసు కీర్తనలు శ్రోతలను మంత్రముగ్దులను చేశాయి. కపిలవాయి లలిత విజయ్‌కుమార్ ఆలపించిన కీర్తనలు మైమరపించాయి. హైదరాబాద్‌కు చెందిన ఏ.శివకృష్ణ స్వరూప్ వయోలిన్, ఉదుమూడి అనురాధ వీణ నాదం ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నేండ్రగంటి కృష్ణమోహన్, కపిలవాయి విజయ్‌కుమార్ దంపతులు, కపిలవాయి సంజయ్‌కుమార్ కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.