చండ్రుగొండ, ఏప్రిల్ 15: మామిడికాయలకు మార్కెట్లో ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభిస్తున్నప్పటికీ దిగుబడి లేకపోవడంతో రైతులు దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11,350 ఎకరాల్లో మామిడిని రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, దమ్మపేట, ములకలపల్లి, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, చుంచుపల్లి, జూలూరుపాడు, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, సుజాతనగర్, ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, కరకగూడెం, మణుగూరు, పినపాక, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో మామిడిని వ్యాపార వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. జిల్లాలో అధికంగా బంగినపల్లి, కేసరి, హిమయత్, తోతాపురి, చిన్న, పెద్ద రసాలు, సువర్ణరేఖ, నీలం, చెరుకురసం లాంటి రకాలను పండిస్తున్నారు.
ఈ ఏడాది చెట్లకు పూత ఆలస్యంగా రావడం, పిందె సమయంలో అకాల వర్షాలకు కాయలు నేలరాలిపోవడం, తెగుళ్లు ఆశించడంతో దిగుబడి భారీగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. ఎకరానికి పది టన్నుల మామిడికాయలు దిగుబడి రావాల్సి ఉండగా ప్రతికూల పరిస్థితుల్లో పది ఎకరాలకు రెండు టన్నుల దిగుబడి రావడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.50 వేల వరకు మూడు దఫాలుగా ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేసి పెట్టుబడి పెట్టారు. పలు గ్రామాల్లో మామిడితోటలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. ఎకరానికి ఉన్న చెట్లను బట్టి రూ.30 వేల నుంచి 40వేల వరకు కౌలు చెల్లించారు. మార్కెట్లో టన్ను రేటు వేలల్లో ఉన్నా దిగుబడి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
చండ్రుగొండ నుంచి ఢిల్లీకి ఎగుమతి
చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో పండించిన మామిడికాయలను మార్కెట్ వ్యాపారులు ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హైదరాబాద్, నాగపూర్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడి వ్యాపారులు ముందుగా ఇక్కడ రైతులకు పెట్టుబడులు వెచ్చించారు. పెట్టుబడులు పెట్టిన రైతుల నుంచి మామిడికాయలను కొనుగోలు చేసి లారీల ద్వా రా తరలిస్తున్నారు.
పచ్చడి మామిడికి డిమాండ్
మామిడి తోటల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి లేక మార్కెట్లో పచ్చడి మామిడికి డిమాండ్ పెరిగింది. చిన్న, పెద్ద రసాలు, ఒకటి రూ.50 వరకు ధర ఉంది. నిత్యావసర వస్తువులతో పాటు మామిడికి ధర పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పచ్చడి మెతుకులు భారంగా మారాయి.
ధర ఉన్నా దిగుబడి లేదు..
మామిడికాయలకు మార్కెట్లో ధర ఉన్నా ఆశించిన స్థాయిలో దిగుబడి లేదు. పెట్టుబడులు రావడం కష్టంగా ఉంది. ఈ ఏడాది యాభై ఎకరాలు కౌలుకు తీసుకొని ఎకరానికి కాయ వచ్చే వరకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాను. అకాల వర్షం, నల్లిపురుగు, తెగుళ్లు, ఆశించి పిందె రాలిపోవడంతో దిగుబడి బాగా తగ్గింది. పది ఎకరాలకు రెండు టన్నులు రావడం కష్టంగా మారింది. మార్కెట్లో ఆశించిన స్థాయిలో రేటు పలుకుతున్నా దిగుబడి లేక ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– చందర్రావు, కౌలు రైతు, చండ్రుగొండ