ఎర్రుపాలెం, సెప్టెంబర్ 05 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని మామునూరు గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీపీఎం ఆధ్వర్యంలో శనివారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, అధికారులను సీపీఎం ఎర్రుపాలెం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు డిమాండ్ చేశారు.
మామునూరు ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు అవసరమైన బ్లాక్ బోర్డులు కూడా లేవని తెలిపారు. ఫర్నిచర్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ముగ్గురే ఉన్నారని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఉన్నత పాఠశాలలో తాగునీటి సదుపాయం సక్రమంగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాడైన డ్రింకింగ్ వాటర్ పరికరంతో పాటు వాటర్ ట్యాపులను వెంటనే మరమ్మతు చేయించాలని డిమాండ్ చేశారు. టాయిలెట్లు అందుబాటులో లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
పాఠశాల క్రీడా మైదానం పిచ్చి, ముళ్ల చెట్లతో నిండిపోయి అపరిశుభ్రంగా మారిందని తెలిపారు. దీంతో పాములు, విష పురుగులకు ఆవాసంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మైదానాన్ని వెంటనే శుభ్రం చేయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మద్దాల ప్రభాకరరావు అన్నారు. మామునూరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘం జిల్లా నాయకులు గౌరాజు రాములు, దూదిగం బసవయ్య, షేక్ లాల్ సాహెబ్, కరీం, శ్రీను పాల్గొన్నారు.