ఇల్లెందు, మే 20 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకకు మద్దతివ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్యావంతుడికి, బ్లాక్ మెయిలర్‌కు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో విద్యావంతుడైన తమ పార్టీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అబద్ధాల కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఇల్లెందు సింగరేణి హైస్కూల్లో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 56 కేసులు ఉన్నాయని అన్నారు. అవి రాష్ట్రం కోసమో, దేశం కోసమో కొట్లాడితే నమోదైన కేసులు కావని స్పష్టం చేశారు. కేవలం బ్లాక్ మెయిలింగ్ చేసినందుకు, బెదిరింపులకు పాల్పడినందుకు, మహిళల గౌరవానికి భంగం కలిగించినందుకు నమోదైన కేసులని తేల్చి చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఇంజినీరింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన విద్యావంతుడని అన్నారు. అమెరికాలో ఉద్యోగాన్ని సైతం వదలి తెలంగాణ ప్రజల కోసం వచ్చినవాడని గుర్తు చేశారు.
ఈ ఎన్నికల్లో బ్లాక్ మెయిలర్‌కు ఓటు వేయాలో, విద్యావంతుడికి ఓటు వేయాలో పట్టభద్రులు ఆలోచించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో సుమారు 24 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకా లక్షలాది మందికి ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు కల్పించిందని, ఎన్నికల కోడ్ రావడంతో నియామక పత్రాలు ఇవ్వలేదని అన్నారు. కానీ.. ఆ తరువాత గెలిచిన కాంగ్రెస్.. ఆ నియామక పత్రాలు అందించి ఆ ఉద్యోగాలన్నీ వారి ప్రభుత్వమే ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. గెలిచిన తర్వాత ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వని సీఎం రేవంత్‌రెడ్డి.. పచ్చి అబద్ధాలతో పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియాలో జరిగిన విష ప్రచారంలో ప్రజలు వాస్తవాలను గమనించలేకపోయారని అన్నారు. సింగరేణిలో 24 వేల ఉద్యోగాలిచ్చి కేసీఆర్ ఆదుకుంటే.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రధాని మోదీ కలిసి సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
నిరుద్యోగులతోపాటు యావత్ తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడి తాను పుట్టిన తెలంగాణ గడ్డ రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి అన్నారు. అమెరికాలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజల కోసమే వచ్చానని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వదించి మీ వద్దకు పంపారని అన్నారు. పట్టభద్రులందరూ ఆలోచించి తనను ఆదరించాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటు వేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, హరిసింగ్‌నాయక్, రంగనాథ్, సిలివేరి సత్యనారాయణ, జేకే శ్రీను, గిన్నారపు రాజేశ్, మహేందర్, శీలం రమేశ్, వరప్రసాద్, అచ్చయ్య, లక్ష్మణ్‌నాయక్, తాతా గణేశ్, పరుచూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.