మామిళ్లగూడెం, ఫిబ్రవరి 20: జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశం రసాభాసగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయమైన సంజీవరెడ్డి భవనంలో మంగళవారం మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు హాజరయ్యారు. దీనికి ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. అనంతరం పార్టీ మహిళా కార్యకర్తల సమావేశం ప్రారంభమవుతున్న సమయంలో పాలేరు నియోజకవర్గం నుంచి కొందరు మహిళలు, ఖమ్మం నియోజకవర్గం నుంచి మరికొందరు మహిళలు వచ్చి సమావేశం జరిగే హాలు బయట వేచి ఉన్నారు. అనంతరం వారికి వారే హాలు లోపలికి వెళ్లారు. ఈ సమయంలో ‘జై పొంగులేటి’, ‘జై తుమ్మల’ అంటూ రెండు వర్గాలకు చెందిన నాయకురాళ్లు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన జిల్లా అధ్యక్షురాలు.. ‘మీరు ఎవరి తరఫున సమావేశానికి వచ్చారు?’ అన్ని ప్రశ్నించారు.
ఆ వెంటనే ‘సమావేశంలో గొడవ చేయకుండా కూర్చోవాలి’ అని సూచించారు. అయితే వచ్చిన వారిలో పొంగులేటి ప్రధాన అనుచరులైన మహిళా నేతలను వేదిక మీదకు ఆహ్వానించకపోవడంతోపాటు వచ్చిన ముఖ్య నాయకురాళ్లను సైతం రాష్ట్ర అధ్యక్షురాలికి పరిచయం చేయకపోవడంతో ఈ రెండు వర్గాలకు చెందిన మహిళా నేతలు బయటకు వచ్చారు. ఈ సమయంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావేద్ రావడంతో బయట వేచి ఉన్న మహిళలు ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు. దానికితోడు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర అధ్యక్షురాలు స్వయంగా వేదిక నుంచి దిగి వచ్చారు. అలిగి వెళ్లిపోతున్న వారిని లోపలికి పిలిచి వారిని వారించే ప్రయత్నం చేశారు. తరువాత వారితో ఫొటోలు దిగారు. ఈ సమయంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులుగా గుర్తింపు ఉన్నవారిని మాత్రమే సమావేశానికి పిలిచామని, ఇతరులు గొడవ చేయకూడదని సౌజన్య అన్నారు. దీంతో ఈ రెండు వర్గాలకు చెందిన నాయకురాళ్లు బయటకు వెళ్లిపోయారు. అనంతరం హాలులో ఉన్న వారితో సమావేశం నిర్వహించారు.