మధిర, మే 05 : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని అకాల మృతికి మధిర బార్ అసోసియేషన్ సోమవారం సంతాపం తెలిపింది. ఆమె చిత్రపటానికి మధిర కోర్టు సీనియర్ న్యాయమూర్తి ఎన్.ప్రశాంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర న్యాయ సేవా సంస్థ తరపున అనేక మంది పేద ప్రజలకు న్యాయం జరిగేలా గిరిజా ప్రియదర్శిని కృషి చేశారని కొనియాడారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల మాట్లాడుతూ.. ప్రియదర్శిని మానవీయ విలువలతో తీర్పులు ఇచ్చారని, పేద, వెనుకబడిన వర్గాలకు తన విలక్షణ తీర్పులతో న్యాయం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.