ఖమ్మం రూరల్, మార్చి 26 : ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుడిమల్లలో అధికారులు బుధవారం మా ఇంటి మన దీపం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని పేరం దివ్య, ఉదయ్ కిరణ్ దంపతులకు ఇటీవల ఆడపిల్లకు జన్మించింది. దంపతుల ఇంటికి వచ్చిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్.కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ షాకిరా బేగం ఆడపిల్ల పుట్టుక పేరుతో వేడుక నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, కుటుంబ సభ్యులు ఇంటిని అందంగా అలంకరించారు. ఆడపిల్లను పుట్టనిద్దాం.. ఆడపిల్లను పెరగనిద్దాం అనే నినాదాలతో ముగ్గురు వేసి అధికారులకు స్వాగతం పలికారు. అనంతరం దివ్య, ఉదయ్ కిరణ్ దంపతులను ఘనంగా శాలువాలతో సత్కరించారు. పూలు పండ్లు ఇచ్చి చిన్నారికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అందజేసిన ప్రశంసా పత్రాన్ని దివ్య దంపతులకు అందించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఆడపిల్ల పుట్టిన ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ శాలువాలతో సత్కరించాలన్న జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సమాజానికి ఆడపిల్ల ఆవశ్యకత ఎలాంటిదో వివరించారు. ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తద్వారా నేడు సమాజంలో అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఆలోచన పట్ల గ్రామ ప్రజలు హర్షాతిరేఖాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ కృష్ణ, అంగన్వాడీ టీచర్లు రాణి, నాగలక్ఙ్మి, కనక, గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Maa Inti Mani Deepam : గుడిమళ్లలో ‘మా ఇంటి మణి దీపం’
Maa Inti Mani Deepam : గుడిమళ్లలో ‘మా ఇంటి మణి దీపం’