ఖమ్మం కల్చరల్, నవంబర్ 8: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. కార్తీక పున్నమి రోజున వేల వెన్నెల కాంతులు వెదజల్లాల్సిన చంద్రుడు ఎర్రగా.. ముదురు నారింజ రంగులోకి మారాడు. అమావాస్య చంద్రుడికి చుట్టూ చీకటి ముసిరింది. వెన్నెలాకాశం చీకటయింది.. సౌర కుటుంబం ఆకాశంలో ప్రభావం చూపింది. సౌర పరిభ్రమణంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చారు. భూమి నీడలో చంద్రుడు ఎర్రగా, ముదురు నారింజ రంగులోకి మారాడు. నిర్మలాకాశంలో స్పష్టంగా ఎరుపు చంద్రుడు కనిపించడం వీక్షకులను అబ్బురపర్చింది. 580 ఏళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం, మళ్లీ మూడు సంవత్సరాలకే ఇటువంటి గ్రహణం రానుండడంతో చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపారు. సాయంత్రం 5:40కు ప్రారంభమైన గ్రహణం 39 నిమిషాలపాటు కొనసాగి 6:19కి విడిచింది. ఆ తర్వాత చందమామ మెల్లిగా గ్రహణం వీడి బయటకు వచ్చాడు ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ ప్రాంతాలను బట్టి పాక్షికంగా ఏర్పడింది. విడుపు సమయంలో చందమామ మెల్లిగా బయటకు వచ్చే దృశ్యం కనువిందు చేసింది. గ్రహణాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో వీక్షించారు. గ్రహణాన్ని నేరుగా వీక్షించకూడదని కొందరు చెప్పినప్పటికీ.. ఆకాశంలో అద్భుతాన్ని తిలకించడానికే ఆసక్తి చూపారు. గ్రహణం విడిచిన అనంతరం ప్రజలు విడుపు స్నానాలు చేశారు. చెడు ప్రభావం చూపే కొన్ని రాశుల వారు దాన ధర్మాలు చేశారు. గ్రహణ సమయంలో రాహు జపం, దుర్గాదేవి ఉపాసనలు, విష్ణు సహస్ర నామ పారాయణాలు చేశారు.
ఆలయాల మూసివేత.. సంప్రోక్షణ..
కార్తీకమాసం మంగళవారం కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాలను ఉదయం మూసివేశారు. గ్రహణం వీడిన అనంతరం సంప్రోక్షణతో తెరిచారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. ఖమ్మం నగరంలోని ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీస్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, శ్రీబ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వరస్వామి ఆలయం, ఎన్ఎస్పీ రామాలయం, కమాన్బజార్, మామిళ్లగూడెం వేంకటేశ్వరస్వామి ఆలయాలు, ప్రభాత్ టాకీస్ రామాలయం, బ్రాహ్మణబజార్ శివాలయం సహా ఇతర శైవ, వైష్ణవ ఆలయాలను రోజంతా మూసివేశారు. గ్రహణ విడుపు అనంతరం ఆలయాల్లో సంప్రోక్షణ చేశారు.
ప్రధాన ఆలయాల మూసివేత..
భద్రాచలం/ ఎర్రుపాలెం/ పాల్వంచ రూరల్, నవంబర్ 8: చంద్ర గ్రహణం కారణంతో జిల్లాలోని ప్రధాన ఆలయాలను అర్చకులు మూసివేశారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 7:30 గంటలకు ఆలయ అధికారులు, అర్చకులు మూసివేశారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం, ఆరగింపు తదితర నిత్య పూజలు యథావిధిగా నిర్వహించారు. ఆర్జిత సేవలను రద్దు చేశారు. గ్రహణానంతరం రాత్రి 7 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయ సంప్రోక్షణ చేశారు. శాంతి హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం ఉదయం యథావిధిగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. పాల్వంచ మండలం పెద్దమ్మతల్లి ఆలయ తలుపులను సైతం అర్చకులు మూసి ద్వారబంధనం చేశారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సైతం మూసివేసి భక్తుల దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని ఈవో జగన్మోహన్రావు తెలిపారు.