భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా భద్రాచలం మండల పరిషత్గా ఆవిర్భవించడంతో ముఖచిత్రం మారిపోయింది. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ప్రతీ మండలానికి ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలనే నిబంధనతో అధికారులు కొత్త స్థానాలపై కసరత్తు చేశారు. గత ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. నోటిఫికేషన్ వచ్చే నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలి. ఈ క్రమంలో అధికారులు జిల్లావ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీల స్థానాల పెంపుదల ప్రక్రియను పూర్తి చేశారు. కొత్తగా ఒక జడ్పీ స్థానం కూడా వచ్చి చేరింది.
జిల్లాలో 2019లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీలు 220 మంది ఉండగా.. 21 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. భద్రాచలం మండల పరిధిలోని పలు గ్రామాలు ఏపీ రాష్ట్రంలో విలీనం కావడంతో మండల స్వరూపం మారిపోయింది. కేవలం భద్రాచలం పట్టణం మాత్రమే మిగలడంతో మండల పరిషత్‌ను రద్దు చేశారు. దీంతో భద్రాచలం గ్రామపంచాయతీగానే మిగిలిపోయింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం పట్టణాన్ని మండలంగా మార్చడంతో ఈసారి పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల జరుగనున్నాయి. ఇప్పటివరకు 21 మండలాలుగా ఉన్న భద్రాద్రి జిల్లా 22 మండలాలతో ముఖచిత్రం మారబోతున్నది. భద్రాచలం, సారపాకను మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదన కూడా తెరపైకి రావడంతో బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక పంచాయతీకి కూడా ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతానికి భద్రాచలంతోపాటు సారపాకకు కూడాఎన్నికలు జరగనుండడంతో ఇక్కడ పెరిగిన 6 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
త్వరలో జరగబోతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం సభ్యుల స్థానాలు ఒకచోట పెరిగి.. మరో చోట తగ్గాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీగా మారడంతో అక్కడ 6 ఎంపీటీసీ స్థానాలను కుదించాల్సి వచ్చింది. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం మండలానికి 5 ఎంపీటీసీ స్థానాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన వల్ల కొన్ని మండలాల్లో కరకగూడెం 1, బూర్గంపాడు 6, భద్రాచలం 14, ఆళ్లపల్లి 1 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దీంతోపాటు భద్రాచలం జడ్పీటీసీ స్థానం కూడా అదనంగా పెరగనున్నది. ఇప్పటివరకు జిల్లాలో 21 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. కొత్తగా మరో స్థానం పెరగడంతో ఆ సంఖ్య 22కు చేరింది.
పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ప్రతీ మండలానికి ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలి. దీనివల్ల కొన్ని మండలాల్లో స్థానాలు పెరిగాయి. భద్రాచలం మండల పరిషత్ కావడంతో అదనంగా 22 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. ఒక జడ్పీటీసీ స్థానం కూడా పెరిగింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం.