దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దసంస్థ అయిన సింగరేణిలో ఉద్యోగులతోపాటు ఓపెన్‌కాస్టుల్లో పనిచేస్తున్న ఆఫ్ లోడింగ్ కార్మికుల పాత్ర కూడా ఎంతో చెప్పుకోదగినది. సింగరేణి సంస్థ సాధిస్తున్న లాభాల్లో వీరి చెమట చుక్కలు కూడా ఉన్నాయి. అయితే ఆఫ్ లోడింగ్ కార్మికులకు ఈపీఎఫ్ చెల్లింపులు జరగడం లేదు.. అయినా సింగరేణి అధికారులు మిన్నకుంటున్నారు.
న్యాయబద్ధంగా వారికి రావాల్సిన ఈపీఎఫ్ చెల్లింపులో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. రూ.కోట్లలో ఈపీఎఫ్లను చెల్లించకుండా గుత్తేదారులు ఎగ్గొడుతూ కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నా ఇటు కార్మికసంఘాలు మౌనం దాల్చుతుండగా.. అటు రాజకీయ పార్టీలు నోరు మెదపడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఉద్యోగం పోతుండడంతో ఆఫ్ లోడింగ్ కార్మికులు తమ ఆవేదనను తమలోనే దిగమింగుతున్నారు.
– రామవరం, ఆగస్టు 9
సింగరేణి సంస్థ ఓపెన్‌కాస్టు గనుల్లో ఆఫ్ లోడింగ్ పనుల(మట్టి తొలగింపు పనులు)ను ప్రైవేట్ వారికి టెండర్ల ద్వారా కేటాయిస్తున్నది. ఎవరు టెండర్లో అర్హత సాధిస్తే వారికి పనులను అప్పగిస్తారు. క్వారీలో ఉన్న మట్టిని తొలగించేందుకు ఓల్వో డ్రైవర్లను, ఇతర మిషనరీలను నడిపే డ్రైవర్లను, మిగతా పనులు చేసేందుకు సంబంధిత కంపెనీలు నియమించుకుంటారు. వీరికి ఇచ్చే జీతంలో ఉద్యోగి(ఎంప్లాయి) నుంచి 12శాతం, కంపెనీ నుంచి 12 శాతం వీరి జీతాల నుంచి ఈపీఎఫ్‌కు మళ్లిస్తారు. ఇందులో 8.33 శాతం భవిష్యత్తులో ఉద్యోగి పెన్షన్ కోసం జమ అవుతుంది.
కానీ చాలా కంపెనీల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించడం లేదు. ప్రతి నెల వీరికి జీతాన్ని చెల్లించే ముందురోజు వీరికి జీతం చిట్టి(పేమెంట్ స్లిప్)ను విధిగా ఇవ్వాలి. ఇందులో ఉద్యోగి నుంచి, కంపెనీ నుంచి ఎంత కట్ అవుతుంది తదితర అంశాలకు సంబంధించి వివరాలు పొందుపర్చి ఉంటాయి. కానీ ఇవెక్కడా కూడా ఆచరణలో కనిపించవు. నగదు జమకు సంబంధించిన సమాచారాన్ని సెల్ఫోన్లో మెసేజ్‌ల ద్వారా పంపించాల్సి ఉంటుంది. కానీ ఇందులో పంపించే సందేశంలో కూడా చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా పంపిస్తూ ఈపీఎఫ్ కడుతున్నామని మభ్యపెడుతుంటారు.
ఇంత జరుగుతున్నా కార్మికసంఘాలు ఈ అన్యాయంపై ప్రశ్నించవు. రాజకీయ పార్టీలైతే అది తమకు సంబంధించిన అంశం కాదన్నట్లు వ్యవహరిస్తుంటాయి. ఇప్పటికీ చాలా ఓసీల్లో కోట్లలో ఈపీఎఫ్ రూపంలో కార్మికులకు చెల్లించాల్సిన నగదును చెల్లించకుండా ఆయా కంపెనీలు వెళ్లిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
కార్మికుల హక్కుల కోసం వారిపక్షాన ఉండి మాట్లాడాల్సిన కార్మిక సంఘాలు మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో జీకేవోసీలో పనిచేసే ఒక సంస్థ కార్మిక సంఘాలకు ప్రతి నెల వారికి నెలవారీ మామూళ్లు ఇచ్చేది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో 12 కుక్కలను సాదుతున్నామనే అహంకారంతో మాట్లాడుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే కార్మికసంఘాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఈ ఒక్క మాటతోనే అర్థం చేసుకోవచ్చు.
సంస్థలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు ఆయా ఏరియాలకు టార్గెట్‌ను విధించడంతో టార్గెట్లపైనే దృష్టి తప్ప ఈ టార్గెట్‌ను చేరుకోవడానికి ఆఫ్‌లోడింగ్ కార్మికులు పడుతున్న బాధలు ఎవరికీ పట్టడంలేదు. ఓబీ నిర్వహించే కాంట్రాక్టర్ చెప్పిందే వేదంగా సింగరేణి నడుస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటే పని ఆపడం వల్ల తమకు నిర్దేశించిన టార్గెట్ పూర్తికాదని, టార్గెట్ లక్ష్యాన్ని అస్త్రంగా చేసుకొని కాంట్రాక్టర్లు సింగరేణి అధికారులను భయపెడుతున్నారు.
చర్యలు తీసుకుందామంటే ఓబీ పనులు ఆగితే టార్గెట్ పూర్తి కాదు, పై అధికారుల నుంచి అక్షింతలు పడతాయి, మనకెందుకు మన జీతం మనకొస్తుంది… ఒకరి జీవితం మనకెందుకు అన్న చందాన వ్యవహరించడంతో సింగరేణిలో కాంట్రాక్టర్లదే రాజ్యం నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సింగరేణి టెండర్లో పిలిచిన దాని కంటే తక్కువగా కోడ్ చేసి పనులు చేజిక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులను ఆపివేసి ఉద్యోగులకు చెల్లించాల్సిన ఈపీఎఫ్‌లు చెల్లించకుండా ముక్కుపిండి వసూలు చేయాల్సిన అధికారులు మౌనం వహించడంతో కాంట్రాక్టర్లకు వరంగా మారుతోంది. 1948 మినిమం వేజెస్ యాక్టు ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్ పీఎఫ్ చెల్లించని పక్షంలో ప్రిన్సిపల్ ఎంప్లాయర్‌గా సంస్థే చెల్లించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా వీరికి ప్రతి 15రోజులకు ఒకసారి వీరు చేసిన పనికి బిల్లులను చెల్లిస్తుంటారు. బిల్లులు చెల్లించే సమయంలో వీరు ఈపీఎఫ్ కట్టని పక్షంలో ముక్కుపిండి వసూలు చేసే అధికారం వీరికి ఉన్నా కానీ వీరి ఉదాసీనత వైఖరి వల్ల అనేకమంది కార్మికులు ఈపీఎఫ్‌ను పొందక తమకు రావాల్సిన హక్కులను కోల్పోతున్నారు.
నేను సత్తుపల్లిలోని జీకేఆర్ సంస్థలో ఓల్వో డ్రైవర్‌గా విధులునిర్వహించాను. నాకు ఏ రోజు కూడా జీతం చిట్టి ఇవ్వలేదు. నాకెంత ఈపీఎఫ్ కట్ అవుతుందని, దీనిలో నా భాగం ఎంత, సంస్థ ఎంత చెల్లిస్తుంది, బోనస్ ఏమన్నా చెల్లించిందా తదితర అంశాలకు సంబంధించిన వివరాలు ఎప్పుడూ ఇవ్వలేదు. నాకు రూ.21 వేల జీతం వచ్చేది. కానీ దానిమీద 12 శాతం నాది, 12 శాతం కంపెనీది రావాలి కానీ. నాకెప్పుడు మెసేజ్ వచ్చినా కేవలం రూ.1300 మాత్రమే చూపించేది. పీఎఫ్ లేనప్పుడు పని ఎందుకని బంద్ చేశాను.
– రొంటాల లింగం, ఆఫ్‌లోడింగ్(డ్రైవర్) కార్మికుడు
కాంట్రాక్టు కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం తరఫున ఎవరైనా ఓబీలో పనిచేసే డ్రైవర్లు ఈపీఎఫ్పైన ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. వీరు చేస్తున్న ఆగడాలను సంస్థ దృష్టికి కూడా తీసుకెళ్లాం. అయినా ప్రయోజనం లేదు. ఇప్పటికే కార్మికశాఖకు, ఈపీఎఫ్ అధికారులకు, కొత్తగూడెంలోని లీగల్ అథారిటీ సెల్‌కు కూడా ఫిర్యాదు చేశాం.
కనీసం వారికి రావాల్సిన 12 శాతం వారిది, 12 శాతం సంస్థది కలిపి 24 శాతం. ఇందులో 8.33 శాతం పెన్షన్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. అదెక్కడా కూడా కనబడడం లేదు. వారు పని చేసినందుకు వారికి ఇవ్వాల్సిన పే స్లిప్ ఇవ్వడం లేదు. సింగరేణిలోని కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెలా పే స్లిప్ ఏ విధంగా ఇస్తున్నారో వీరికి కూడా అదేవిధంగా పే స్లిప్ ఇవ్వాలి. ఈపీఎఫ్ జమ చేయని అధికారులపైన చర్యలు తీసుకోవాలి.
– రాసూరి శంకర్, కాంట్రాక్టు కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు