అపర చాణక్యుడు..
రాజకీయ దురంధరుడు.. ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల ఎత్తులను చిత్తు చేస్తూ పార్టీ నుంచి పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని అసెంబ్లీ స్థానాలను తప్ప మిగిలిన అన్ని స్థానాలకూ సీట్లు కన్ఫర్మ్ చేసి రాజకీయ ప్రత్యర్థులకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు.. ఇతర పార్టీలకు సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసి చూపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికీ అభ్యర్థులను వెతుక్కుంటున్న క్రమంలో శాసనసభ ఎన్నికలకు మూడు నెలల ముందుగానే రేసులోకి ‘గులాబీ’ గెలుపు గుర్రాలను బరిలోకి దింపారు. ప్రతిపక్షాలకు పట్టపగలే చుక్కలు చూపించారు. జాబితా ప్రకటనపై ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నాయకులు ప్రధాన కూడళ్లలో బాణసంచా కాలుస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ సందడి చేశారు.
ఖమ్మం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ పార్టీ సోమవారం ప్రకటించింది. పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు దక్కడంతో సీఎం కేసీఆర్ నమ్మకానికి పెద్దపీట వేసినైట్లెందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సీఎం కేసీఆర్ సీటు ఖరారు చేశారు. అలాగే ఎమ్మెల్యేలుగా వివిధ పార్టీల నుంచి గెలుపొంది బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆరుగురు శాసన సభ్యులకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ టికెట్లు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంతో జిల్లాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అయోమయం నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్ పార్టీ శిబిరంలో నిరాశ నిస్పృహలు అలుముకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి రాజకీయ ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేసేలా.. సొంత పార్టీ శ్రేణులకు రాజకీయ ఊతమిచ్చేలా అభ్యర్థుల ఎంపిక ఉండడంతో పార్టీలు పార్టీ అధినేత కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్‌కు ప్రత్యర్థి రాజకీయ వర్గాలకు దిమ్మతిరిగేలా ఉందనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.
ఖమ్మం నుంచి మూడోసారి ‘పువ్వాడ’
ఖమ్మం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను అసెంబ్లీ ఎన్నికల బరిలో వరుసగా మూడోసారి నిలవనున్నారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి ఖమ్మం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అజయ్‌కుమార్ రెండోసారి విజయఢంకా మోగించారు. 2019లో సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నిత్యం ప్రజల్లో ఉండే మనిషిగా, విద్యాధికుడిగా పేరున్న పువ్వాడ అజయ్ రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడంలో దిట్టగా పేరొందారు. పరిణతి చెందిన రాజకీయ నేతగా.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరుగాంచారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి పువ్వాడ అజయ్ హ్యాట్రిక్ సాధించడం కోసం ఇప్పటికే క్షేత్రస్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
సత్తుపల్లి నుంచి సండ్ర..
సత్తుపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్యకు సీఎం కేసీఆర్ టికెట్ ఖరారు చేశారు. 1994లో పాలేరు నుంచి సీపీఎం అభ్యర్థిగా గెలుపొందిన వెంకటవీరయ్య 1999లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2004లో నియోజకవర్గాల పునర్విభజనలో సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సండ్ర 2004, 2009, 2018లో టీడీపీ తరఫున వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన నేతగా పేరొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన సండ్ర పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోసారి విజయం సాధించేందుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నారు.
Cm Kcr
వైరా నుంచి మదన్‌లాల్‌కు..
వైరా సిట్టింగ్ ఎమ్మెల్యే రాములునాయక్ స్థానంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు పార్టీ అధినేత కేసీఆర్ టికెట్ ఖరారు చేశారు. రాములునాయక్ గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క సిట్టింగ్ స్థానానికి పార్టీ అభ్యర్థిని మార్చింది. వైరా అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేసిన బానోతు మదన్‌లాల్ 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2014లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. రాజకీయ సమీకరణల దృష్ట్యా పార్టీ ఈసారి మదన్‌లాల్ వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. మదన్‌లాల్ తన గెలుపు కోసం ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఎన్నికల యుద్ధభేరి మోగించేందుకు సమాయత్తమవుతున్నారు.
కొత్తగూడెంకు వనమా..
మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావుకు పార్టీ నేత కేసీఆర్ కొత్తగూడెం టికెట్ ఖరారు చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది బీఆర్ఎస్ పార్టీలో చేరిన వనమాకు టికెట్ ఖరారు చేసి పార్టీని నమ్ముకున్న వారికి పెద్దపీట వేశారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
పినపాకకు రేగా..
పినపాక బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావును పార్టీ నేత కేసీఆర్ ఖరారు చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన రేగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కీలక నేతగా మారారు. దీంతో రేగాను బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయడంతోపాటు సీఎం కేసీఆర్ ప్రభుత్వ విప్‌గా నియమించారు. మూడోసారి విజయం సాధించేందుకు నియోజకవర్గంపై పూర్తిస్థాయి దృష్టి సారించి ప్రజలతో మమేకమవుతున్నారు.
పాలేరుకు కందాల..
పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా కందాళ ఉపేందర్‌రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. సౌమ్యుడిగా, దాతృత్వం కలిగిన నేతగా పేరున్న కందాళ గత ఎన్నికల్లో పాలేరు నుంచి 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు కందాళ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకోవడంలో నిమగ్నమయ్యారు.
అశ్వారావుపేటకు మెచ్చా..
అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావును పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ విధేయుడిగా, మృధుస్వభావిగా, వివాద రహితుడిగా పేరొందిన మెచ్చా 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మెచ్చా రెండోసారి విజయం సాధించేందుకు కార్యక్షేత్రంలోకి దిగారు.
ఇల్లెందుకు హరిప్రియ..
ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే భానోతు హరిప్రియానాయక్ పేరును ఖరారు చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన హరిప్రియ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. చివరి నిమిషం వరకు రాజకీయ ఉత్కంఠ కలిగించిన ఇల్లెందు టికెట్‌ను హరిప్రియకే ఖరారు చేసింది.
భద్రాచలంకు తెల్లం..
భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. సుధీర్ఘకాలం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి కొద్దిరోజులు కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి సొంతగూటికి వచ్చిన తెల్లం వెంకట్రావ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ద్వారా సముచిత స్థానాన్ని.. గౌరవాన్ని ఇచ్చినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వెంకట్రావు 2014లో వైఎస్సార్ సీపీ నుంచి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2018లో భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజా వైద్యుడిగా, ఉన్నత విద్యాధికుడిగా భద్రాచలం నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా విజయబావుటా ఎగురవేసేందుకు కార్యక్షేత్రంలోకి దిగారు.
మధిరకు కమల్‌రాజు..
మధిర బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం జడ్పీ చైర్మన్, పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల కమల్‌రాజ్‌కు మరోసారి అవకాశం ఇచ్చింది. 2009, 2014, 2018 ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కమల్‌రాజ్ నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు సాధించిన నేతగా గుర్తింపు పొందారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు కొద్ది నెలలుగా పూర్తిస్థాయిలో కార్యకర్తలతో మమేకమవుతూ చమటోడుస్తున్నారు. కాగా.. పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో పార్టీ వర్గాల్లో పూర్తిస్థాయి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.