అశ్వారావుపేట, జూన్ 4 : గిరిజన నియోజకవర్గమైన అశ్వారావుపేటలో మద్యం సిండికేట్ దోపిడీకి తెరలేపింది. మొన్నటివరకు ఎమ్మార్పీ విక్రయాలు చేసిన మాఫియా మే 1వ తేదీ నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మద్యం మాఫియా దందా ఏడాదికి రూ.87.55 కోట్లకు చేరింది. ఇందులో మద్యం సిండికేట్ వాటా రూ. 32.83 కోట్లు కాగా.. బెల్టు వ్యాపారులు రూ.54.72 కోట్లు దోచుకుంటున్నారు. బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేస్తున్న వ్యాపారులు 15 శాతం, బెల్టు నిర్వాహకులు అదనంగా మరో 20 శాతం దండుకుంటున్నారు.
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ కళ్లు మూసుకోగా.. పోలీస్ అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం వ్యాపారులు, బెల్టు దుకాణాదారులు పెద్దలను వదిలి 80 శాతం మద్యం వినియోగిస్తున్న మధ్యతరగతి, పేదలనే లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. దోచుకున్న అక్రమ సంపాదనలో వ్యాపారులు నెలవారీ మామూళ్లకు రూ.2.58 కోట్లు చెల్లిస్తున్నట్లు అంచనా. చివరికి మద్యంప్రియులు అధిక ధరలు చెల్లించలేక కిక్కు కోల్పోతున్నారు.
మద్యం దుకాణాల నిర్వహణలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ అధికారులతో వ్యాపారులు కుమ్మకై దోచుకుంటున్నారు. బెల్టు దుకాణాల ద్వారా అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ దందాకు పాల్పడుతున్నారు. క్వార్టర్ సీసాపై రూ.20 నుంచి రూ.25 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బెల్టు నిర్వాహకులు మరో రూ.30 నుంచి రూ.35 దోచుకుంటున్నారు. వీరు ఇరువురూ కలిసి సుమారు 35 శాతం ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూళ్లు చేస్తున్నారు. మద్యం అధిక విక్రయాల కోసం వ్యాపారులు ప్రతి చిన్న గ్రామంలోనూ బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారు. దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేయలేని మద్యంప్రియులు అందుబాటులో ఉన్న బెల్టు దుకాణంలోనే అధిక ధరలకు మద్యం కొనుగోలు చేస్తున్నారు.
అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా ఏడాదికి సుమారు రూ.418 కోట్ల మద్యం వ్యాపారం సాగుతోంది. ఒక్కో దుకాణం లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు. దీనికి ప్రభుత్వం 10 రెట్లు మద్యం సరఫరా చేస్తున్నది. అంటే రూ.5.50 కోట్ల విలువైన మద్యం సరఫరా చేస్తున్నది. 12-13 శాతం కమీషన్ వ్యాపారులకు ఇస్తున్నది. ఈ టార్గెట్ పూర్తయిన తర్వాత కేవలం రూ.6 శాతం కమీషన్ మాత్రమే చెల్లిస్తుంది. అయితే మొదటి మూడు నెలల్లోనే వ్యాపారులు ప్రభుత్వ మద్యం టార్గెట్‌ను పూర్తి చేశారు. ఇంకా 9 నెలల కాలం మద్యం విక్రయించాలి. ఇప్పటినుంచి ప్రభుత్వం ఇచ్చే 6 శాతం కమీషన్‌తో సంతృప్తి చెందని వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఇంకేముంది ఏకంగా 15 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు చేస్తూ అక్రమ దందాకు తెరలేపారు. దీనికితోడు బెల్టు నిర్వాహకులు మరో రూ.30 దోచుకుంటున్నారు.
ఏడాదికి మద్యం సిండికేట్ వ్యాపారుల దోడిపీ రూ.87.55 కోట్లు ఉండొచ్చని మద్యం ప్రియుల అంచనా. అశ్వారావుపేట నియోజకవర్గ మండలాల్లో మొత్తం 19 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిద్వారా ఏటా రూ.418 కోట్ల మద్యం వ్యాపారం సాగుతున్నదని అధికారుల అంచనా. క్వార్టర్‌కు రూ.20 అదనంగా వసూలు చేసినా రూ.32.83 కోట్లు, బెల్టు నిర్వాహకులు మరో రూ.30 దండుకున్నా అదో రూ.54.72 కోట్లు వెరసి వ్యాపారుల దందా రూ.87.55 కోట్లకు చేరుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బెల్టు విక్రయాలను ప్రోత్సహించేందుకు మద్యం వ్యాపారులు రాత్రి 8 గంటలకే దుకాణాలు మూసివేస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వ గడువు ఉన్నా బెల్టు దుకాణాల వైపు మద్యంప్రియులను అలవాటు చేసేందుకు 2 గంటల ముందే వ్యాపారాలను బంద్ చేస్తున్నారు.
మద్యం కొనుగోలులో బడాబాబుల కంటే మధ్య, దిగువ తరగతి ప్రజలే ఎక్కువగా ఉంటారు. అందుకే వారు ఎక్కువగా వినియోగించే కొన్ని బ్రాండ్లనే వ్యాపారులు టార్గెట్ చేశారు. వాటిలో రాయల్ స్టాగ్, మెన్షన్ హౌస్, ఓఏబీ, చీప్ లిక్కర్, నాకౌట్, కింగ్‌ఫిషర్ బీర్లు ప్రధానం. ఇవి మద్యం దుకాణాల్లో దొరకకుండా చేస్తున్నారు. దీంతో మద్యంప్రియులు బెల్టు దుకాణాలను ఆశ్రయించక తప్పడం లేదు. ఇక్కడ మద్యం వ్యాపారులు వసూలు చేసే(క్వార్టర్‌కు) రూ.20లకు బెల్టు నిర్వాహకులు అదనంగా రూ.30 మొత్తం రూ.50 వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీ సొమ్ములో ఎక్సైజ్, పోలీస్ శాఖలకు నెలవారీ మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నెలవారీగా మామూళ్ల వాటా రూ.2.58 కోట్లు కాగా, ఏడాదికి రూ.21.52 కోట్ల భారీ దోపిడీ అవుతున్నట్లు అంచనా.