ఎర్రుపాలెం, అక్టోబర్ 18: కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలన్నీ కేసీఆర్ పథకాలను కాపీ కొట్టినవేనని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఎత్తుగడతోనే కాంగ్రెస్ అలవిగానీ హామీలను ఇస్తోందని అన్నారు. ఆ పార్టీ చెబుతున్న ఆరు గ్యారెంటీలు కావని, నూరు అబద్ధాలని దుయ్యబట్టారు. ఎర్రుపాలెం మండలంలో బుధవారం పర్యటించిన ఆయన.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గుంటుపల్లి గోపవరంలో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో అపూర్వ స్పందన ఉందని, ప్రజలు ఆయనను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే మధిర నియోజకవర్గ ప్రజలు గుర్తొచ్చే ఎమ్మెల్యే భట్టికి ఇక్కడి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇంత అభివృద్ధి కళ్ల ముందు కనబడుతున్నా కాంగ్రెస్ నాయకులు మాత్రం అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క.. మూడు పర్యాయాలు అబద్ధాలు చెప్పి ఇక్కడి ప్రజలను మోశారని ఆరోపించారు. ఆయన ఆటలు ఇక సాగవని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గమనించి ఎమ్మెల్యేగా తనను ఆదరించాలని కోరారు.
కమల్‌రాజు అత్యధిక మెజార్టీ అందించాలి: కొండబాల
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజుకు అత్యధిక మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. బూత్ కమిటీ సభ్యులు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు చావా రామకృష్ణ, దేవరకొండ శిరీష, శీలం కవిత, పంబి సాంబశివరావు, కోట శ్రీనివాసరావు, కృష్ణారావు, సాంబశివరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కొండేపాటి సాంబశివరావు, బాలరాఘవరెడ్డి, అప్పారావు, మూల్పూరి శ్రీనివాసరావు, మస్తాన్‌వలీ, శ్రీనివాసరెడ్డి, తిరుపతిరావు, శ్రీకాంత్‌రెడ్డి, అంకసాల శ్రీనివాసరావు, పుల్లారెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, చిట్టిబాబు, రవి, కిశోర్‌బాబు, బాబూరావు, భాస్కర్, కృష్ణారెడ్డి, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.