ముదిగొండ, అక్టోబర్ 6 : ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదేనని జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి లింగాల కమల్‌రాజ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తిరిగి వివరించే బాధ్యతను బీఆర్ఎస్ శ్రేణులు తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ముఖ్య కార్యకర్తలతో వెంకటాపురం గ్రామంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.
గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అన్ని మండలాల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను మనం ఓట్లుగా మలుచుకోవాలని, ఆ దిశగా ఇప్పటికే నుంచి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. బాకీ కార్డు బీఆర్ఎస్ సృష్టించింది కాదని, కాంగ్రెస్ పార్టీయే ఆ అవకాశం ఇచ్చిందన్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు.. ఇలా ప్రతి ఒకరికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలకు బాకీ పడ్డారని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార కూడా గ్యారెంటీ కార్డు మీ దగ్గర ఉంటే పథకాలకు గ్యారెంటీ మాది అని చెప్పారని విమర్శించారు.
90 రోజుల్లో పథకాలు అమలు చేస్తామని చెప్పి.. 20 నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని ధీమా వ్యక్తం చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొంత సర్దుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వాచేపల్లి లక్ష్మిరెడ్డి, గడ్డం వెంకటేశ్వర్లు, సామినేని హరిప్రసాద్, పోట్ల ప్రసాద్, బంక మల్లయ్య పచ్చ సీతారామయ్య, చెరుకుపల్లి భిక్షం, షేక్ ఖాజా, కోటి అనంతరాములు, తేరాల రామారావు, సత్యనారాయణరెడ్డి, పడిశాల భద్రయ్య, అమడాల జక్కర్, బత్తుల వెంకట్రావ్, లింగస్వామి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.