మధిర, ఏప్రిల్ 21 : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు లక్షలాదిగా తరలిరావాలని కోరుతూ మడుపల్లి గ్రామంలో జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి లింగాల కమల్రాజు ఆధ్వర్యంలో సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తొలుత బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ సభ ఆవశ్యకతను వివరిస్తూ బీఆర్ఎస్ సభకు తరలిరావాలని కోరారు.
ఈ సందర్భంగా కమల్రాజు మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాలను ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పూర్తిస్థాయిలో ఆదుకున్నదని గుర్తు చేశారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పాలన సాగిస్తున్నదని, ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రజతోత్సవ సభకు జాతర మాదిరిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అరిగె శ్రీనివాసరావు, యన్నంశెట్టి అప్పారావు, పుచ్చకాయల వెంకటనారాయణ, ఐలూరి ఉమామహేశ్వరరెడ్డి, నీలం హనుమయ్య, పంబి సత్యనారాయణ, వేల్పుల శ్రీనివాసరావు, పగడాల వీరభద్రం, ఆళ్ల నాగబాబు, పరిస శ్రీనివాసరావు, చీదిరాల రాంబాబు, లంకెమల్ల నాగేశ్వరరావు, చీమల పుల్లయ్య, ఏసుపోగు దేవ, కొండ పాల్గొన్నారు.