మధిర, అక్టోబర్ 27 : స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే భట్టివిక్రమార్క అందుబాటులో ఉండే పరిస్థితి లేదు, ఆయన హైదరాబాద్, ఢిల్లీకే పరిమితమవుతున్నాడు. ఈ ఎన్నికల్లో ఆశీర్వదించండి మీకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తా అని బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. శుక్రవారం పట్టణంలో ఆయన ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అప్పగించిన తర్వాత మధిర నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను ఓటర్లకు అందిస్తూ వాటివల్ల జరిగే ప్రయోజనాలను వివరించారు. దేశంలోనే ఇలాంటి మ్యానిఫెస్టో విడుదల చేసిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల మ్యానిఫెస్టో వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలనే కాపీ కొట్టి వాటిని ప్రచారంలోకి తీసుకెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, వార్డు కౌన్సిలర్లు దరావత్ మాధవి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కనుమూరి వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, సహకార సంఘం అధ్యక్షులు బిక్కి కృష్ణప్రసాద్, కరివేద సుధాకర్, యన్నంశెట్టి అప్పారావు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.