రఘునాథపాలెం, మార్చి 8: చిమ్మపూడి టు మంచుకొండ రోడ్డు సమస్యకు లైన్ క్లియర్ అయింది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న రోడ్డుకు మంగళవారం గ్రీన్ సిగ్నల్ పడింది. మంచుకొండ గ్రామం చిమ్మపూడికి పక్కనే ఉన్నా..రోడ్డు లేని కారణంగా చుట్టూ 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి. దీనిపై ఇటీవల ఇరుగ్రామాల పెద్దలు మంత్రి పువ్వాడ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి పువ్వాడ భూమిని కోల్పోయే రైతులను పిలిచి మాట్లాడాలని బాధ్యతను టీఆర్ఎస్ నాయకులు మందడపు నర్సింహారావు, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్‌తో పాటు ఇరుగ్రామాల సర్పంచ్‌లకు అప్పగించారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఎకరం 30కుంటల భూమిని ఇచ్చేందుకు రైతులు సమ్మతించారు. గురువారం మంచుకొండ వేదికగా రైతులను పిలిచి చర్చలు జరిపారు. సమావేశంలో ఇరుగ్రామాల పెద్దలు దొంతు సత్యనారాయణ, గుత్తా వెంకటేశ్వరరావు, గొర్రె శ్రీనివాసరావు, గంగిరెడ్డి విజయ్‌రెడ్డి, గుండ్ల ముత్తయ్య, ఆత్మచైర్మన్ భుక్యా లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.