కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 28 : కాంగ్రెస్ పాలనలో రైతులు సాగు పనులు వదిలి యూరియా కోసం రోడ్డెక్కుతున్నారని, నిత్యం ఇదే తంతు జరుగుతున్నా పట్టించుకునే పాలకులు కరువయ్యారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏ రైతూ యూరియా కోసం ఇబ్బంది పడలేదని, రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్న ఘటన బీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అధికారం దక్కించుకునేందుకు అలవిగాని హామీలు ఇచ్చారని, గద్దెనెక్కిన తర్వాత రైతులు, కార్మికులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు మోసం చేశారని విమర్శించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ.. ప్రజలను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు అందరి లెక్కలు తేలుద్దామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సమన్వయంతో పనిచేస్తే విజయం మనదేనన్నారు. కాంగ్రెస్ పాలన అంటే.. ఒకరేమో సెటిల్మెంట్లు, ఇంకొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మరొకరు అన్నింట్లో కమీషన్లు దండుకుంటూ పాలనను గాలికొదిలేశారని ఆరోపించారు.
కేసీఆర్ పదేళ్ల కాలంలో ఎన్నడూ యూరియా సమస్య రానీయకుండా పాలన చేస్తే.. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను రోడ్డు మీదకు తీసుకొచ్చిందని మండిపడ్డారు. సాగు పనులు చేసుకోవాల్సిన రైతులు సొసైటీల వద్ద పొద్దంతా పడిగాపులు కాస్తున్నా ముఖ్యమంత్రి, మంత్రులుగానీ పట్టించుకోవడం లేదన్నారు.
బీజేపీ, కాంగ్రెస్కు చెరో 8 మంది ఎంపీలను గెలిపిస్తే వారు ఏ రోజు కూడా రైతుల కష్టాలను, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేంద్రం చేసే పనులకు అడుగులకు మడుగులొత్తుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే ఎన్నికల నిర్వహణను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, కోర్టు మొట్టికాయలు వేయడంతో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారని అన్నారు.
జిల్లాలో వచ్చే నెల 10, 11 తేదీల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యక్రమం ఉన్నందున నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పవచ్చని అన్నారు. జిల్లాలో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని వారు కోరా రు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్ హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, భద్రాచలం బీఆర్ఎస్ ఇన్చార్జి మానే రామకృష్ణ, దిండిగల రాజేందర్, కాపు సీతాలక్ష్మి పాల్గొన్నారు.