ఇల్లెందు/ చండ్రుగొండ/ కొత్తగూడెం గణేశ్ టెంపుల్, మే 17 : చమురు ధరల పెంపుపై వామపక్షాల నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటర్కు రూ.3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ప్రభుత్వం ఇటీవల పెంచిన విషయం విదితమే. అయితే, ఈ పెంపుదలను వ్యతిరేకిస్తూ వామపక్షాల నేతలు, వాటి అనుబంధ సంఘాల నాయకులు ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ ఆందోళనలు కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఆటోలను, ఇతర వాహనాలను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలు, సంఘాల నేతలు మాట్లాడుతూ.. పెంచిన ధరలను తగ్గించేదాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చమురు ధరలను పెంచబోమంటూ ఆ మధ్య గొప్పగా హామీలిచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందని విమర్శించారు. ఆకాశాన్నంటుతున్న నితావసర వస్తువుల ధరలను కూడా తక్షణమే అదుపుచేయాలని డిమాండ్ చేశారు. ‘పొదుపు సూత్రాలు ప్రజలకేనా? ప్రధానికి వర్తించవా?’ అంటూ ఎద్దేవాచేశారు. ‘మోదీది స్వదేశీ నినాదం – విదేశీ వ్యామోహం’ అని విమర్శించారు. ధరలు తగ్గించే వరకూ దశల వారీగా ఆందోళనలు చేస్తామని తేల్చిచెప్పారు. ఆయా పార్టీల నేతలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.