భద్రాచలం, ఏప్రిల్ 2 : శ్రీరామ నవమి, మహా పట్టాభిషేకం మహోత్సవాలకు భద్రాచలం తరలివచ్చే భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవ వేడుకల ఏర్పాట్లపై బుధవారం ఆయన శాఖలవారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 6, 7వ తేదీల్లో స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం కార్యక్రమాలకు వచ్చే భక్తుల కోసం మిథిలా స్టేడియంలో ప్రతీ సెక్టార్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కల్యాణ వేడుకలు వీక్షించేందుకు 26 సెక్టార్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు స్వామివారి కల్యాణ వేడుకలు వీక్షించి జన్మజన్మల పుణ్యఫలం పొందేలా అధికారులు కృషి చేయాలన్నారు.
కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంతోపాటు మహా ప్రసాదం అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సీఎం రాక కోసం మూడు హెలిపాడ్లను సిద్ధం చేస్తున్నామని, ఆర్డబ్ల్యూఎస్, వైద్యారోగ్య శాఖ ద్వారా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామని, లైఫ్ జాకెట్లు, 20 మంది గజ ఈతగాళ్లు, రిస్క్ బోట్లు సిద్ధంగా ఉంచామన్నారు.
భద్రాచలం, పర్ణశాలల్లో హెలిపాడ్లు, ఏరియా వైద్యశాలలో 24 గంటలు పనిచేసే అంబులెన్సుతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, ఆర్డీవో దామోదరరావు, దేవస్థానం ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.