ఖమ్మం, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని నిషేధిత భూముల జాబితాలో చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన పేరును నిషేధిత జాబితాలో నుంచి తొలగించుకోవడానికి 30 శాతం కమిషన్ ఇవ్వరు కదా.. అయినా ఎలా పెట్టారంటూ ఎద్దేవా చేశారు. శనివారం ఖమ్మం నగరంలోని వీవీసీ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ వన్‌టౌన్, టూటౌన్ కమిటీ బీఎల్ఏల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ భూ దోపిడీకి పాల్పడుతోందని పువ్వాడ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కబ్జాలు అనే పరిస్థితికి దిగజారిందన్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెప్పడంతో సమసిపోయే సమస్య కాదని, రాష్ట్రంలో వేలాది భూ బాధితులకు ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందేనని మండిపడ్డారు. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సరిదిద్దుకోలేని తప్పును చేసి క్షమాపణతో తప్పించుకోలేరని దుయ్యబట్టారు.
పేదవాడికి కంటిమీద కునుకు లేకుండా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమనేది ఈ విషయంతో రుజువైందన్నారు. నిషేధిత భూముల జాబితాలో తప్పులు జరిగాయని మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పి వారం రోజులు గడుస్తున్నా నేటికీ సవరణలు జరగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భూ దోపిడీకి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో 8 నుంచి 9 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత భూములు నేడు కోటి ఎకరాలకు ఎలా చేరుకున్నాయో రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వందశాతం రైతు రుణమాఫీ పూర్తయ్యిందంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారని, అది నిజమని నిరూపించేందుకు ఏ గ్రామానికైనా వచ్చి రైతు రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మాజీ మంత్రి పువ్వాడ సవాల్ విసిరారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో నీటి కొరత, సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ కనీసం ముగ్గురు మంత్రులు ఉండి ఈ అంశంపై దృష్టి సారించే పరిస్థితిలేదని విమర్శించారు. సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రాజీవ్‌సాగర్ నిర్మాణం పూర్తయిన ఏడాదికే లైనింగ్ కూలిపోయిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మంలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల నిమిత్తం 23ఎకరాలను క్యాబినెట్ ఆమోదంతో మంజూరు చేయించి జీవో తీసుకొచ్చానని పువ్వాడ గుర్తుచేశారు. వాటిని జర్నలిస్టులకు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
నగరంలో బీఎల్ఏలుగా పనిచేసిన వారిని సత్కరించి వారికి ప్రశంసపత్రాలు అందించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షత వహించగా.. సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, మాజీ కార్పొరేటర్లు శీలంశెట్టి వీరభద్రం, నాగండ్ల కోటి, బత్తుల మురళీప్రసాద్, బిక్కసాని జశ్వంత్, బుర్రి వెంకట్, మగ్బుల్, రోజ్లీనా, నాయకులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, మెంతుల శ్రీశైలం, గాదే అనిల్, తాజుద్దీన్, పొన్నం వెంకటేశ్వర్లు, జ్యోతిరెడ్డి, నిరోషా, సుదర్శన్, రవికాంత్, సుగుణరావు, పాషా, పాలగుడు నాగేశ్వరరావు, షకీనా పాల్గొన్నారు.