దమ్మపేట, సెప్టెంబర్ 29: ‘ఆరు నూరైనా 2024 ఆగస్టు 15లోగా రూ.2 లక్షల లోపున్న రుణాలను మాఫీ చేస్తాం. ఈ విషయంలో మాట తప్పేదిలేదు. మడమ తిప్పేది లేదు.’ అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. ఆచరణలో అంతా ఒట్టిదే చేసింది. కుటుంబ నిర్ధారణ ద్వారా రైతుల అర్హతను తేల్చుతామంటూ చెప్పింది.
ఇందుకోసం రుణమాఫీ కాని రైతుల ఇంటికి వ్యవసాయ అధికారులు వెళ్లి సెల్ఫీలు దిగి ఆ ఫొటోను, రైతుల వివరాలను ప్రభుత్వ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆగస్టు 15 తరువాత మొదలైన ఈ ప్రక్రియ రెండు నెలలు కావస్తున్నా రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. దీంతో ‘సెల్ఫీలతోనే సరిపెట్టేస్తారా?’ అంటూ అర్హులైన రైతులందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మూడు విడతల్లోనూ రుణమాఫీ కాకుండా మిగిలిన రైతుల పంట రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణమంటూ చెబుతున్నారు. రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు 15నే పూర్తయినట్లు చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులు దుపులుకుందంటూ ఆరోపిస్తున్నారు. ‘మా అర్హత తేల్చేదెన్నడు? రుణమాఫీ చేసేదెప్పుడు? తిరిగి పంట రుణాలు ఇచ్చేదెన్నడు?’ అంటూ నిట్టూరుస్తున్నారు. ఉదాహరణకు భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలాన్ని పరిశీలిస్తే అక్కడి పరిస్థితి అర్థమవుతోంది.
దమ్మపేట మండలంలో సుమారు 11,300 మంది రైతులు రుణమాఫీకి అర్హులంటూ ప్రభుత్వమే తేల్చింది. అయితే అనేక కారణాలు చెబుతూ వీరిలో సుమారు 3,300 మందిని రుణమాఫీకి దూరం చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తామంతా రుణమాఫీకి అర్హులమేనంటూ ఈ రైతులందరూ గగ్గోలు పెట్టడంతో ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. సాంకేతిక కారణాలతోపాటు ఇతరత్రా పొరపాట్ల వల్ల వీరికి రుణమాఫీ కాలేదని చెప్పింది.
వ్యవసాయ శాఖ అధికారులు ఈ రైతుల ఇంటి వద్దకే వచ్చి వీరి అర్హతను నిర్ధారిస్తారని చెప్పింది. దీంతో అధికారులందరూ తొలినాళ్లలో రుణమాఫీ కాని రైతుల ఇంటి బాట పట్టారు. ఆ తరువాత రైతువేదికల వద్దనే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ ప్రక్రియ మొదలై కూడా రెండు నెలలు గడుస్తున్నాయి. అయితే ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ ఇంకా ముగియలేదు. ఇంకా 500 మంది రైతు కుటుంబాల వివరాలను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉందంటూ అధికారులు చెబుతున్నారు.
అయోమయంలో అన్నదాతలు..
అయితే, సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని వారిలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామంటూ రెండు నెలలుగా చెబుతూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గ్రూపింగ్ సర్వే పేరుతో సరిపెడుతోంది తప్ప ఆచరణలో మాఫీపై మాట్లాడడంలేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ‘రుణమాఫీ చేస్తుందా? లేదా?’ అంటూ అయోమయానికి గురవుతున్నారు. కాగా, దూర ప్రాంతాల్లో ఉంటున్న కొందరు రైతులు ఫ్యామిలీ గ్రూపింగ్ కోసం హాజరుకాలేకపోతున్నారు. దీంతో ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యమవుతోంది. కాగా, మండలంలో ఇంకా 3,300 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా.. వారిలో 2,800 మంది రైతుల ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా సుమారు 500 మంది రైతుల ఫ్యామిలీ గ్రూపింగ్ను నిర్ధారించి సెల్ఫీలు దిగాల్సి ఉంది.