బూర్గంపహాడ్, ఏప్రిల్ 17: ఐటీసీలో 14వ వేతన ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ వద్ద కార్మిక సంఘం నాయకులు, కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డిలు మాట్లాడుతూ వేతన ఒప్పంద చర్చలు ఆరు నెలలుగా సాగుతున్నా ఇప్పటివరకు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు.
ఇందులో కొత్తగా బోనస్ స్కీమ్లు, బీసీటీఎంపీ స్కీమ్లు లేకపోయినా ఒప్పంద చర్చలు ఇంత సుదీర్ఘకాలంగా సాగడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. వేతన ఒప్పంద ప్రక్రియను పూర్తి చేయని పక్షంలో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రూ.22 వేల ప్యాకేజీ షరతులు లేని నూరు శాతం అన్ లిమిటెడ్ మెడికల్ రిటైర్మెంట్ కార్మికులకు రూ.12 లక్షల బెనిఫిట్ కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘ నాయకులు, పలువురు కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.