ఎంతో ఘన కీర్తి కలిగిన కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ (కేఎస్ఎం) కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నది. కాకతీయ యూనివర్సిటీతో అనుసంధానంగా ఉన్న ఈ కళాశాల నేడు సమస్యల హారతి పలుకుతున్నది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. కేఎస్ఎంను యూనివర్సిటీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చినప్పటికీ అది నీటి మూటగానే మిగిలిపోయింది. యూనివర్సిటీ చేయడం కాదు కదా.. కనీసం కాలేజీకి రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వడం లేదు. దీంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు భోజనం పెట్టలేని దుర్భర స్థితి ఏర్పడింది. ఇదే కొనసాగితే కాలేజీ శాశ్వతంగా మూతపడే ప్రమాదమూ లేకపోలేదు.
-భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 1 (నమస్తే తెలంగాణ)
సింగరేణి సంస్థకు మైనింగ్ ఇంజినీరింగ్ విద్య అవసరమై 1978లో కొత్తగూడెం – పాల్వంచ పట్టణాల మధ్యలో మైనింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఇది అప్పడు ఉస్మానియా అనుసంధానంగా ఉండేది. తెలంగాణ ఏర్పడ్డాక కాకతీయ యూనివర్సిటీ కింద కొనసాగుతున్నది. ప్రభుత్వాలు మారుతున్నా కాలేజీ తలరాత మాత్రం మారడంలేదు. గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం దీనిని యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేసే ప్రయత్నంలో ముందుకెళ్లింది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం రావడంతో కాంగ్రెస్ సర్కారు ఆ ఫైల్‌ను మూలనపడేసింది. దీంతో కాలేజీకి కష్టాలు మొదలయ్యాయి. అధ్యాపకుల నియామకాలు జరపడం లేదు. దీంతో 34 మంది అధ్యాపకులు ఉండాల్సినప్పటికీ కేవలం 12 మందితోనే సర్దుబాటు చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 8 మంది పని చేస్తున్నారు.
375 మంది పురుషులు, 280 మంది మహిళలు హాస్టల్లో ఉండి ఈ కాలేజీలో చదువుతున్నారు. కానీ, వీరికి సకాలంలో మెస్ బిల్లులు రాకపోవడంతో సిబ్బంది ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటివరకు రూ.6 కోట్లు మెస్ బిల్లులు, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. మైనింగ్ కోర్సు ద్వారా ఏర్పాటు చేసిన కాలేజీలో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. అప్పులు ఇచ్చిన షాపుల నిర్వాహకులు కాలేజీల చుట్టూ తిరుగుతుండడం గమనార్హం. ఎవరికి చెప్పినా ఫలితం లేకపోవడంతో కాలేజీ నిర్వాహకులు వేరే గ్రాంట్లను బదలాయించుకుని కాలేజీని నడుపుతున్నారు. 900 మంది ఉండే ఈ కాలేజీలో 5 కోర్సులు నడుస్తున్నాయి. సీఎస్ఈ, ఈసీసీ, మైనింగ్, ఈసీఈ, ఐటీ ద్వారా విద్యార్థులు బీటెక్ చేస్తున్నారు. కాలేజీ ఆవరణలో ఎక్కడ చూసినా పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. పేరుకే 392 ఎకరాలు స్థలం ఉన్నా అందులో ప్రభుత్వమే మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, కలెక్టరేట్, ఇతర కార్యాలయాలకు 80 ఎకరాలను తీసుకోవడంతో చివరికి 312 ఎకరాలు మాత్రమే మిగిలింది.
ఎంతోకాలంగా ఈ కాలేజీ మంచిగా నడుస్తున్నది. యూనివర్సిటీ స్థాయిలో నియామకాలు జరగకపోవడంతో ఇబ్బందులు ఉన్నాయి. కాలేజీలో సిబ్బంది కొరత బాగా ఉంది. మెస్ బిల్లులు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. భవనాలు ఉన్నప్పటికీ ఇతర సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ఇక్కడ మైనింగ్ కోర్సు పూర్తిచేసి సింగరేణిలో ఉద్యోగాలు చేస్తున్నారు.
-టీ.జగన్మోహన్రాజు, కాలేజీ ప్రిన్సిపాల్
బీఆర్ఎస్ పాలనలో అన్ని విభాగాల్లో నియామకాలు జరిగాయి. వాళ్లందరికీ ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు. కాకతీయ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న ఈ కాలేజీని ప్రత్యేక యూనివర్సిటీ చేస్తే అభివృద్ధి చెందుతుంది. కోర్సులు పెరుగుతాయి. సరిపడా ఫ్యాకల్టీని నియమించాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి.
-ఎస్.అనుదీప్, టీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్