ఖమ్మం సిటీ, జనవరి 5: ఖమ్మంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన కాకతీయ యూనివర్సిటీ పరిధి ఇంటర్ జోనల్ క్రికెట్ చాంపియన్‌షిప్‌ను వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం ఖమ్మం జట్టుతో జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో వరంగల్ జట్టు విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం జోన్.. నిర్ణీత 30 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
జట్టులోని డేవిన్ 43, అజహాన్ 29, అభిలాశ్ 12, సంతోశ్ 13 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వరంగల్ జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 172 పరుగులు చేసి విజేతగా నిలిచింది. విశాల్ యాదవ్ 68 పరుగులు చేసి జట్టు విజయంతో కీలకపాత్ర పోషించాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో డీవైఎస్వో తుంబూరు సునీల్‌రెడ్డి, కవితా మెమోరియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణారావు.. విన్నర్స్, రన్నర్స్‌గా నిలిచిన వరంగల్, ఖమ్మం జట్లకు ట్రోపీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు చక్కటి ప్రతిభను కనబరిచారని అభినందించారు. ఆదివారంతో కేయూ వార్షిక క్రీడాపోటీలు ముగిశాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ జే ఉపేందర్, పీడీ రఘునందన్, సెలెక్టర్లు ఎం కుమార్, అఫ్జల్, గోపి, అస్లాం, ఎండీ మతిన్, ఆర్ ఉపేందర్, కమల్, సతీష్ పాల్గొన్నారు.