పాల్వంచ, జనవరి 20: ఆరు దశాబ్దాల పాటు వెలుగులు పంచి, వేలాది మంది ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులకు బతుకునిచ్చి, పారిశ్రామిక వాడ పాల్వంచ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసిన కేటీపీఎస్ (కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్) ఓఅండ్ఎం కర్మాగారం తన వెలుగుల ప్రస్థానాన్ని ముగించింది. ముంబైకి చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఎనిమిది యూనిట్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది.
పాల్వంచ ప్రాంతంలో జలవనరులు పుష్కలంగా ఉండడం, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు అత్యధికంగా ఉండడం, పరిశ్రమ నెలకొల్పేందుకు తగినంత భూమి అందుబాటులో ఉండడంతో నాటి ప్రభుత్వం థర్మల్ పవర్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించింది. 1966లో ప్రభుత్వం ఎ-విభాగంలో 60 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తర్వాత 1977లో బి-స్టేషన్లో 110 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు, 1974లో సి-స్టేషన్లో 110 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు నెలకొల్పాయి. ఇలా మొత్తం 720 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర గ్రిడ్‌కు సరఫరా చేసిన ఘనత ఈ యూనిట్లది.
కేటీపీఎస్ ప్రారంభం కాకముందు పాల్వంచ పట్టణ జనాభా అంతంతమాత్రంగా ఉండేది. కర్మాగారం ప్రారంభమైన తర్వాత ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వచ్చే ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికులతో క్రమంగా జనాభా పెరిగింది. క్రమంగా పట్టణం మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. ఎనిమిది యూనిట్ల పరిధిలో 2,400 మంది శాశ్వత కార్మికులు, 1600 మందికి పైగా ఇంజినీర్లు పనిచేసేవారు. అలాగే 4వేల మంది జిల్లావాసులు, వలస జీవులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు. ప్రస్తుతం పట్టణ జనాభా 1.20 లక్షలకు చేరింది.
కేటీపీఎస్ పరిధిలోని ఎనిమిది యూనిట్లతో వచ్చే కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నదని కొన్నేళ్ల క్రితం కొందరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేయగా బోర్డు వెంటనే స్పందించింది. ప్రస్తుత ఎనిమిది యూనిట్లను తొలగిస్తేనే కేటీపీఎస్ పరిధిలో కొత్త యూనిట్లకు అనుమతులు మంజూరు చేస్తామని తేల్చి చెప్పింది. దీంతో జెన్కో అధికారులు గత్యంతరం లేని పరిస్థితిలో పాత యూనిట్ల తొలగింపునకు అంగీకరించారు. అనంతరం బోర్డు కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించనున్న ఏడో దశ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. 2020 మార్చి 31న కేటీపీఎస్ పాత యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి శాశ్వతంగా తగ్గింది. ప్రస్తుతం ఏడో దశ నిర్మాణం పూర్తయి కర్మాగారంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది.
కేటీపీఎస్‌లోని ఎనిమిది యూనిట్ల తొలగింపు, యంత్ర పరికరాలు, ఇతర సామగ్రి అమ్మకానికి టీఎస్ జెన్కో యాజమాన్యం టెండర్లు నిర్వహించింది. ముంబాయికి చెందిన హెచ్ఆర్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.485 కోట్లకు టెండర్ దక్కించుకున్నది. కర్మాగారాన్ని నేలమట్టం చేసి యంత్ర పరికరాలన్నింటినీ ఆ కంపెనీ తరలించుకుపోనున్నది. కంపెనీ ఇప్పటికే పనులు ప్రారంభించింది. పనులను కేటీపీఎస్ ఏడో దశ సీఈ పాలకుర్తి వెంకటేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు.