పాల్వంచ, ఏప్రిల్ 16: తెలంగాణ ప్రభుత్వం కార్మికులపైనా బెదిరింపులకు దిగింది. ‘విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం (డీమ్డ్ టర్మినేషన్)’ అంటూ జెన్కో యాజమాన్యం ద్వారా అనధికారిక ఉత్తర్వులతో ఒత్తిడి చేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కార్మికులు గురువారం సమ్మెను విరమించారు. ఏపీఎస్సీబీ రూల్స్ ప్రకారం, ఎన్నికల హామీ ప్రకారం తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన విషయం విదితమే. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జేఏసీ (టీవీఏఈ జాక్) పిలుపు మేరకు విధులు బహిష్కరించి పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణంలో సమ్మెను కొనసాగిస్తున్నారు.
ఈ నెల 8న ప్రారంభమైన సమ్మె గురువారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. కేటీపీఎస్‌లో సమ్మె ఉధృతంగా కొనసాగడంతో ప్రభుత్వ ఒత్తిడి మేరకు టీజీజెన్కో యాజమాన్యం కఠిన చర్యలకు పూనుకుంది. జెన్కోలో సమ్మె చేస్తున్న కార్మికులందరూ విధుల్లో చేరకపోతే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ (డీమ్డ్ టర్మినేషన్) అనధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్మికులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో కేటీపీఎస్ ప్రాంగణంలో 5, 6 దశల్లో 1,362; కేటీపీఎస్ ఏడో దశ, ఓఅండ్ఎం, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేస్తున్న 729 మంది ఆర్టిజన్లు భయాందోళకు గురయ్యారు. ఉద్యోగాలను ప్రభుత్వం తొలగిస్తుందేమోనని ఆందోళన చెందారు.
బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రభుత్వం నుంచి జెన్కోకు, జెక్కో యాజమాన్యం నుంచి కేటీపీఎస్ అధికారులకు అనధికారిక ఉత్తుర్వులు అందాయి. దీంతో కేటీపీఎస్ అధికారులు కూడా ఆ అనధికారిక ఉత్తర్వులను ఆర్టిజన్ కార్మికులందరికీ చేరవేశారు. ‘ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లందరూ గురువారం ఉదయం 10 గంటలకల్లా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం’ అంటూ అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆర్టిజన్లందరూ భయాందోళనకు గురై బుధవారం అర్ధరాత్రి నుంచే కొద్దికొద్దిమంది చొప్పున విధులకు వెళ్లడం ప్రారంభించారు. గురువారం ఉదయం 10 గంటలకల్లా విధుల్లో చేరాలన్న ఆజ్ఞలు ఉండడంతో అప్పటి వరకూ సమ్మె శిబిరంలో ఉన్న 200 మంది కార్మికులు ఆ తరువాత వెళ్లి విధుల్లో చేరారు. దీంతో కేటీపీఎస్‌లోని ఆర్టిజన్లందరూ సమ్మె విరమించినట్లయింది.