ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 15:ఖమ్మంలో గత నెల 31న ఊహించని విధంగా ఉప్పొంగిన మున్నేరు ప్రవాహం తెల్లారేసరికి వేలాది కుటుంబాలను చెల్లాచెదురు చేసింది. లక్షలాది ఎకరాల పంటను ముంచేసింది. కష్టజీవులకు కట్టుబట్టలు తప్ప మరేమీ మిగలలేదు. ఇళ్లన్నీ నీటమునిగి సమస్తమూ కొట్టుకుపోయింది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బయటకు పేదలందరికీ.. మరుసటి రోజు నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు, ఇంటి సామగ్రి, వంట సామగ్రి వరదపాలయ్యాయి. కొందరి ఇళ్లు కొట్టుకుపోయాయి.
ఇంకొంది ఇళ్లు కూలిపోయాయి. అప్పటి నుంచి వరద బాధిత కుటుంబాలు.. ముఖ్యంగా పేదల పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్సులా మారింది. కానీ అలాంటి వారిని ఆపదలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు.. కనీస భరోసా కూడా ఇవ్వలేదు. ఇలా సర్కారు సాయం కోసం ఎదురుచూసిన వారిలో చాలామంది ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. రోజులు గడుస్తున్నా సర్కారు సాయం అందకపోవడం, ఇకనైనా భరోసా లభిస్తుందన్న నమ్మకం నశించిపోవడం వంటి కారణాలతో కొందరు పేదలు గుండె చెదురుతున్నారు. ఇలాంటి వారిలో కుటుంబ యజమాని అయిన ఓ వృద్ధుడు ఉన్నాడు. మున్నేరు మిగిల్చిన భారాన్ని భరించలేని అతడు.. ఆర్థిక ఒత్తిడిని తాళలేక గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
ఖమ్మం నగరంలోని 48వ డివిజన్‌కు చెందిన దోరేపల్లి కోటయ్య (70) దశాబ్దాలుగా దానవాయిగూడెం పార్కు ఏరియాలోని గణేశ్‌నగర్‌లో ఓ రేకుల ఇంట్లో నివసిస్తున్నాడు. గతంలో డ్రైవర్‌గా పనిచేసిన ఆయన.. వృద్ధాప్యం కారణంగా కొన్నేళ్లుగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కుమారులు ఉండగా అంతకుమునుపే కుమారుడు మరణించాడు. కుమార్తెకు వివాహం ఆమె కూడా అత్తారింటికి వెళ్లిపోయింది. అవివాహితుడైన ఈ కుమారుడు కూడా తల్లిదండ్రులతో ఉండడం లేదు.
భార్య శాంతమ్మతో కలిసి కోటయ్య ఆ రేకుల ఇంట్లో నివసిస్తున్నాడు. తనకు వచ్చే రూ.2 వేల ప్రభుత్వ ఆసరా పింఛన్‌తోనే జీవనాన్ని వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 31న వచ్చిన మున్నేటి భారీ వరద వీరి ఇంటిని ముంచెత్తింది. కోటయ్య, అతటి భార్య శాంతమ్మ కలికి ఆ రాత్రి కట్టుబట్టలతో బయటికెళ్లాడు. కొద్దిరోజులపాటు తెలిసిన వారి ఇంట్లో తలదాచుకున్నారు. వరద తగ్గాక ఇంటికి రావడంతో ఇంటి గోడలన్నీ పగుళ్లతో కన్పించాయి. బాత్రూం కూలిపోయింది.
అతడి మోపెడ్ వాహనం బురదలో కూరుకుపోయింది. నిత్యావసర సరుకులు సహా ఇంట్లోని వస్తువులన్నీ వరదలో కొట్టుకుపోయాయి. వీరు వృద్ధాప్యంలో ఉన్నందున బంధువులు వచ్చి ఇంట్లోని బురదను శుభ్రం చేసి వెళ్లారు. ఈ క్రమంలో సర్వస్వం కోల్పోయి తీవ్రమైన ఒత్తడికి గురైన కోటయ్య.. ఐదు రోజులుగా మనోవేదనతో ఉంటున్నాడు. గుండె సంబంధిత వ్యాధికి గురైనట్లు తెలిసింది. దీంతో ఖమ్మంలోని ఓ వైద్యశాలకు తరలించగా మూడురోజులపాటు చికిత్స పొందినట్లు సమాచారం. శనివారం డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నప్పటికీ ఇంటి పరిస్థితిపై ఆదే ఆందోళన చెందాడు. ఈ క్రమంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో కోటయ్య ఆదివారం మధ్యాహ్నం ప్రాణాలు వదిలాడని స్థానికులు, కటుంబ సభ్యులు తెలిపారు.