వేసవిలోనే పటిష్ట పర్చాలి వేసవిలోనే కాల్వల నిర్వహణను పూర్తి స్థాయిలో చేపడితే.. కాల్వలకు గండ్లు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాల్వలో నీళ్లు బంద్ కాగానే.. కాల్వలో కంప చెట్లు మొలుస్తుంటాయి. కాల్వల గట్లపై చెత్తాచెదారం పేరుకుపోతుంటుంది. కొన్ని చోట్ల్ల కాల్వలలో పూడిక పేరుకుపోతుంటుంది. ఇవన్నీ మళ్లీ నీళ్లు వదిలేలోపు సరిచూసుకుని కాల్వలను పటిష్ట పర్చాలి. ఇవేవి చూడకుండా నీళ్లు వదిలితే.. లేదా భారీ వర్షాలు కురిస్తే కాల్వలకు గండ్లు పడతాయి. నాలుగైదేండ్ల కిందట నీళ్ల కరువుతో ఉన్న కల్వకుర్తికి సాగు నీరు వచ్చినప్పుడు తమ చెరువులు నిండాలనే ఉద్దేశంతో రైతులు అక్కడక్కడా చెరువులకు గండ్లు పెట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాల్వలకు గండ్లు పెట్టాల్సిన అవసనం రైతులకు లేదు. ఇప్పుడు అధికారులు చేయాల్సింది కాల్వలకు పడిన గండ్లను పూడ్చడం. పటిష్ట పరచడమే.
– బీ.రాంచంద్రారెడ్డి, కేఎల్ఐ జేఏసీ నాయకుడు, కల్వకుర్తి
కల్వకుర్తి, ఆగస్టు 16 : ఎంజీకేఎల్ఐ 29వ ప్యాకేజీకి సంబంధిన డిస్ట్రిబ్యూటరీ కాల్వకు గండ్లు పడుతున్నాయి. ఆరు రోజుల కిందట డీ-63 కాల్వకు గండి పడితే.. నాలుగు రోజుల కిందట డీ-82 కాల్వకు రెండు చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో కాల్వల పరిధిలోని పొలాలన్నీ జలమయయ్యాయి. పంటలు నీటిలో మునిగి పోవడమే కాకుండా పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. జరిగిన నష్టాన్ని తలుచుకుని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరు రోజుల కిందట కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామ సమీపంలో డీ-63 కాల్వకు గండి పడింది. ఈ మధ్యనే ఈ కాల్వను తవ్వారు. ఎగువ పొలాల నుంచి వచ్చే వరద నీరు కాల్వలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేయకపోవడంతో.. వచ్చిన నీటి ఉధృతికి కాల్వ తెగిపోయింది. పొలాల్లోకి నీళ్లు పెద్ద ఎత్తున చేరడంతో దెబ్బతిన్నాయి. ముందుగానే ఎగువ నుంచి వచ్చే వరద నీటిని కాల్వలోకి మళ్లించే ఏర్పాటు చేసినట్లయితే.. ఇంత నష్టం జరగకుండే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేఎల్ఐ డిస్ట్రిబ్యూటరీ కాల్వలో డీ-82 కాల్వ అతి పెద్దది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 29వ ప్యాకేజీ ద్వారా కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీరు పారింది. 29వ ప్యాకేజీ ద్వారా వచ్చే నీరు నియోజకవర్గంలో కేవలం కల్వకుర్తి మండలానికి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉండగా.. మిగతా మండలాలకు సాగునీరు అందే పరిస్థితి లేకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం డీ-82 కాల్వకు శ్రీకారం చుట్టింది. మాడ్గుల మండలం నాగిళ్ల వరకు (కల్వకుర్తి నియోజకవర్గం చివరి గ్రామం వరకు) సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆగమేఘాలపైన కసరత్తు చేసింది. దాదాపు 60 కిలోమీటర్ల మేర కాల్వ తవ్వేందుకు వీలుగా పరిపాలన అనుమతులు ఆమోదించింది. ఇందుకు సంబంధించి నిధులు మంజూరు చేసింది. డీ-82 కాల్వ ద్వారా కల్వకుర్తి మండలంలోని కొన్ని గ్రామాలు, వంగూర్ మండలం, వెల్దండ మండలం, చారకొండ మండలం, ఆమనగల్లు, మాడ్గుల మండలాలకు సాగునీరు అందే క్రమంలో కాల్వ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది. పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ క్రమంలో ఎగువన వర్షాలకు కురియడంతో కేఎల్ఐ పంపులు ఆన్‌చేసి ప్రధాన కాల్వలకు నీళ్లు వదిలారు. అదే క్రమంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కాల్వలకు గండ్లు పడి రైతులకు తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నాయి. డీ-82 కాల్వకు రెండ్రోజుల కిందట వెల్దండ మండలం పొతేపల్లి- గుండాల గ్రామాల వద్ద మినీ అక్విడెక్ట్ వద్ద కాల్వకు గండి పడింది. బుధవారం చారకొండ మండలం జూపల్లి గ్రామం వద్ద కాల్వకు గండి పడింది. దీంతో నీరంతా పొలాలను ముంచె త్తడంతో పలు రకాల పంటలు నీటమునిగాయి.
వర్షాకాలానికి ముందే కాల్వలో పేరుకుపోయిన పూడికను తొలగించడంతోపాటు కాల్వలో మొలకెత్తిన కంప చెట్లను తొలగించడంతోపాటు కాల్వల కట్టలను నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని రైతు లు అంటున్నారు. నిర్వహణ అసంపూర్తిగా ఉండడంతో ఒకేసారి నీళ్లు రావడంతో కాల్వలు తెగిపోయేందుకు ఆస్కారం ఉంటుందని వారు చెబుతున్నారు. విపరీతమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాల్వలకు గండ్లు పెట్టాల్సిన అవసరం ఏ రైతుకు ఉండదని అంటున్నారు. కాల్వకు గండ్లు పెడితే లాభం కన్నా నష్టం ఎక్కువగా జరుగుతుందని చెబుతున్నారు. వేసవి కాలంలోనే కాల్వ నిర్వహణ, పట్టిష్టతకు చర్యలు తీసుకుంటే కాల్వలకు గండ్లు పడే అవకాశాలు ఏమాత్రం ఉండవని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని పలువురు కోరారు.
పోతేపల్లి- గుండాల మధ్యలో డీ-82 కాల్వకు మినీ అక్విడెక్ట్ వద్ద పడిన గండిని ఎమ్మెల్యే నారాయణరెడ్డి పరిశీలించారు. కాల్వకు ఉద్దేశ్యపూర్వకంగా గండి పెట్టారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాల్వకు గండి పెట్టిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. కాల్వలపైన గస్తీ ఉంచాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం ఎవరైన కాల్వకు గండి పెట్టి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది జరిగిన రెండో రోజే చారకొండ మండలం జూపల్లి వద్ద డీ-82 కాల్వకు మరో గండి పడింది.
ఇంతకు కాల్వలకు గండ్లు పడుతున్నాయా..? పెడుతున్నారా? అన్న ప్రశ్నలు నియోజకవర్గ ప్రజల్లో వినిపిస్తున్నాయి, గండ్లు పడినా.. ? పెట్టినా? చివరకు నష్టం మాకేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడిన గండ్లను మూసివేసి భవిషత్లో మళ్లా పడకుండా పూర్తి చర్యలు తీసుకోవాలని అధికారులను రైతులు కోరుతున్నారు. గండ్లతో పంటలు నష్టపోయే రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని రైతు సంఘ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జూరాలకు వరద హోరు
గద్వాల, ఆగస్టు 16 : జూరాలకు 95 వేల క్యూసెక్కులు వస్తుండగా.. డ్యాం 6 గేట్ల ద్వారా దిగువకు 41,112 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.184 టీఎంసీలు నిల్వ ఉన్నా యి. విద్యుదుత్పత్తికి 38,879 క్యూసెక్కులు వదులుతుండగా.. అవుట్‌ఫ్లో 80,374 క్యూసెక్కులుగా నమోదైంది.
అయిజ, ఆగస్టు 15 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. దీంతో శనివారం 14 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 41,808 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 43,946 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 55,739 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి సామర్థ్యం 105. 788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 79.73 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఫుల్ లెవల్ 1633 అడుగుల కాగా.. ప్రస్తుతం 1626.06 అడుగులుగా నమోదైంది. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 36,443 క్యూసెక్కులు ఉండగా.. ప్రధాన కాల్వకు 493 క్యూ సెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు 35,950 క్యూసెక్కుల చేరుతుండగా.. ఆనకట్టలో ప్రస్తుతం 10.5 అడుగుల మేర నీటినిల్వ ఉన్నది.