ఖమ్మం, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం అర్బన్ మండల విద్యాధికారి పోస్టు వివాదాస్పదంగా మారింది. డీడీవో(డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్) కోడ్ లేదని కారణం ఒకటి కాగా, ఆ మండలానికి ఎంఈవో పోస్టే లేదనేది మరో కారణంగా వినిపిస్తున్నది. పూర్తి వివరాల్లోకెళ్తే.. జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. గతంలో అర్బన్ మండలంగా ఉన్న దానిని రెండు మండలాలుగా చేసి ఒకటి అర్బన్, మరోటి రఘునాథపాలెంగా మార్చారు. మండలంలో పనిచేసే ప్రతి విభాగంలో ఉన్న అధికారి ఎంపీడీవోకి రిపోర్ట్ చేయాలి. దీంతో రఘునాథపాలెం మండలానికి ఎంపీడీవో పోస్టు ఉంది, అర్బన్‌కి ఎంపీడీవో పోస్టు లేదనే దానితో రఘునాథపాలెం మండలానికి ఎంఈవో పోస్టు, అర్బన్‌కు ప్రత్యేకంగా ఎంఈవో పోస్టు ఉండదనే వాదన వినిపిస్తుంది. ఎంఈవోలు 9, 10వ తరగతికి సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు, ఇతరత్రా చేయాలన్నా డీడీవో కోడ్ ఉండాలి. ఇదే డీడీవో కోడ్ చుట్టూ ఎంఈవో పోస్టు వివాదం నడుస్తున్నది. అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో ఒక్కదానికి మాత్రమే డీడీవో కోడ్ ఉంది. గతంలో అర్బన్ ఎంఈవోకు ఉన్న డీడీవో కోడ్ ఇప్పుడు ఎంపీడీవో లేడు కాబట్టి అది రఘునాథపాలెంకి వర్తిస్తుందని, మరికొందరు అర్బన్‌కే డీడీవో కోడ్ ఉంది. రఘునాథపాలెంకి లేదని విద్యాశాఖాధికారులు విభిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన శైలజాలక్ష్మి ఈ నెల 24న పాఠశాలలో హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు డీఈవోకి సమాచారం ఇవ్వగా.. కొంత సమయం వేచి ఉండాలని డీఈవో సోమశేఖర శర్మ సూచించారు. దీంతో గురు, శుక్రవారాలు వేచి ఉన్నారు. శనివారం బాధ్యతలు స్వీకరించేందుకు సన్నద్ధమవ్వగా ఉన్నతాధికారుల నుంచి సమాచారం లేదని చెబుతూ డీఈవో విధుల్లో చేరొద్దని ఆమెకు మౌఖిక ఆదేశాలిచ్చారు.
పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించేందుకు మండల నోడల్ ఆఫీసర్లనే ఇన్చార్జి ఎంఈవోలుగా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులిచ్చారు. ఆయా మండలాల్లో సీనియర్లుగా ప్రధానోపాధ్యాయులను(ఎంఎన్‌వో)లను ఎంఈవోలుగా నియమిస్తూ సెప్టెంబర్ 24న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో భాగంగా ఖమ్మం అర్బన్ ఎంఈవోగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా, అర్బన్ ఎంఎన్‌వోగా ఉన్న శైలజాలక్ష్మిని నియమించారు. అప్పటికే ఆమె ఉన్నతాధికారుల అనుమతితో అమెరికా వెళ్లారు. దీంతో ఇన్చార్జిగా రఘునాథపాలెం ఎంఈవో రాములుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె విదేశాల నుంచి ఈ నెల 24న వచ్చి స్కూల్లో హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శనివారం అర్బన్ ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించి డీఈవో, ఆర్జేడీ, విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
సెలవు అనంతరం హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించాం. అర్బన్ ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆర్జేడీ నుంచి అనుమతి రాలేదు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకునే వరకు రెండు రోజులు ఆగాలని వరంగల్ ఆర్జేడీ సూచనలను వివరించాను. అనుమతి రాకపోయినా విధుల్లో చేరడంతో ఆ రిపోర్ట్‌ను ఆర్జేడీకి నివేదించాం.
– సోమశేఖర శర్మ, డీఈవో
అర్బన్ ఎంఈవోగా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వుల ఆధారంగానే అర్బన్ ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించాను. విధుల్లో చేరొద్దని అధికారికంగా ఏమి ఇవ్వలేదు. హెచ్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఈవోని కలిసి పరిస్థితిని వివరించాం.
– శైలజాలక్ష్మి, ఎంఈవో, ఖమ్మం అర్బన్