ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీకి (Khammam) అవార్డుల పంట పండింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులు ప్రశంస పత్రాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖలకు చెందిన అధికారులకు ప్రభుత్వం ఉత్తమ అవార్డులు ప్రకటించింది. ఈ దఫా ఖమ్మం రూరల్ మండలంలోని ముగ్గురు అధికారులకు ఉత్తమ అవార్డులు దక్కాయి. జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఖమ్మం రూరల్ మండలం తాసిల్దార్ పీ. రాంప్రసాద్, ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, సివిల్ సప్లయ్ డీటీ విజయబాబు ఉత్తమ అధికారులుగా ప్రశంసా పత్రాలను స్వీకరించారు.
ఏడాదిన్నర క్రితం ఖమ్మం రూరల్ మండల తాసిల్దార్గా బాధ్యతలు చేపట్టిన రాంప్రసాద్ వరుసగా రెండుసార్లు ఉత్తమ అధికారిగా అవార్డులు స్వీకరించడం విశేషం. తమ శాఖ అధికారికి ఉత్తమ అవార్డు రావడం పట్ల ఆయా శాఖల ఉద్యోగులు అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. ముగ్గురు మండలాధికారులకు ఉత్తమ అవార్డులు రావడం పట్ల మండల నాయకులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.