వారంతా ఆదివాసీలు.. అడవితోనే అనుబంధం.. అడవే వారికి ఆధారం.. విప్పపువ్వు.. బీడీ ఆకులు సేకరిస్తూ జీవనం సాగిస్తుండే వారి జీవితాల్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త వెలుగులు నింపింది. ఆదివాసీ స్త్రీలు స్వశక్తితో ముందుకు సాగేలా ఆర్థిక చేయూతనం దించింది. 13 మంది మహిళలను ఒక బృందంగా ఏర్పాటు చేసి రూ.లక్షలు వెచ్చించి పల్లీపట్టి యూనిట్ నెలకొల్పింది. స్వయం ఉపాధికి బాటలు వేసింది. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగ రంలోని వ్యవసాయ మార్కెట్ గోడౌన్ లో రూ.40 లక్షలతో పల్లీ పట్టి యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌కు 60 శాతంతో రూ.24 లక్షల రాయితీని ఐటీడీఏ కల్పిస్తోంది. మిగిలిన 30 శాతం బ్యాంకు రుణం. మరో 10 శాతం గ్రూపు సభ్యుల వాటా ధనం. అంతేకాదు, ఇక్రిశాట్ ద్వారా రూ.18 లక్షలతో యూనిట్లో యంత్రాలను సమకూర్చారు. ఐటీడీఏ, ఇక్రిశాట్ సహకారంతో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న పలీ ్లపట్టి యూనిట్‌పై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
దుమ్ముగూడెం, మే 3: ఆదివాసీ మహిళలకు అండగా నిలస్తోంది తెలంగాణ ప్రభుత్వం. వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో అనేక విధాలుగా చేయూతనిస్తోంది. వాటిని ఒడిసి పట్టుకుంటున్న గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే దుమ్ముగూడెం మండలం ఆదివాసీ మహిళలు. ఏజెన్సీ ప్రాంతమైన లక్ష్మీనగరంలో పల్లీ పట్టి యూనిట్‌తో గిరిజన మహిళలకు స్వయం ఉపాధి లభిస్తోంది. ఐటీడీఏ సహకారంతో స్వయంగా వ్యాపారం చేసి ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. లక్షలాది రూపాయల ఖర్చుతో పల్లీ పట్టి యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. 13 మంది మహిళలు గ్రూపుగా ఏర్పడి ఐటీడీఏ, ఇక్రిశాట్ సహకారంతో సాధిస్తున్న ఆర్థిక స్వావలంబనపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఐటీడీఏ సహకారంతో..
భద్రాచలం ఐటీడీఏ సహకారంతో మండల కేంద్రమైన లక్ష్మీనగరంలో రూ.40 లక్షలతో వ్యవసాయ మార్కెట్ గోడౌన్లో పల్లీ పట్టి యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇలాంటి యూనిట్లు లక్ష్మీనగరంతోపాటు భద్రాచలం, అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామాల్లో ఉన్నాయి. భద్రాచలంలో జొన్న ఉప్మా, కిచిడీ, తుమ్మల చెరువులో కందిపప్పు, శెనగపప్పు, లక్ష్మీనగరంలో నువ్వుల పల్లీ పట్టి, పుట్నాల పల్లీ పట్టిని మిషనరీతో తయారు చేస్తున్నారు. లక్ష్మీనగరంలో రూ.40 లక్షలతో నెలకొల్పిన ఈ యూనిట్‌కు 60 శాతంతో రూ.24 లక్షల సబ్సిడీ ఐటీడీఏ కల్పిస్తోంది. మిగిలిన 30 శాతం బ్యాంకు రుణం. మరో 10 శాతం గ్రూపు సభ్యుల వాటా ధనం. ఇదిలా ఉండగా ఇక్రిశాట్ ద్వారా రూ.18 లక్షలతో ఈ యూనిట్లో యంత్రాలను సమకూర్చారు. యూనిట్ టెక్నికల్ అధికారిగా ఉన్న లక్ష్మీకాంత్, ఐటీడీఏ అగ్రికల్చరల్ అధికారి భాస్కరరావు ఎప్పటికప్పుడు గ్రూపు సభ్యులకు తయారీ విధానం, యంత్రాల పనితీరు అంశాలపై సూచనలు చేస్తుండడంతో యూనిట్‌ను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్ ద్వారా పల్లీ పట్టీ తయారీకి మండలంతోపాటు ఇతర గ్రామాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
పల్లీ పట్టీ తయారీ విధానం..
లక్ష్మీనగరంలోని ఈ పల్లీ పట్టి యూనిట్‌ను 13 మంది గ్రూపు సభ్యులు నడుపుతున్నారు. గ్రూపు సభ్యుల్లో 9 మంది మహిళలే. మిషనరీకి సంబంధించిన ఆ నలుగురు పురుషులు టెక్నికల్, ఫిట్టర్ హోదాతో యూనిట్‌ను రన్ చేస్తున్నారు. గిరిజన సిక్కీ పేరుతో గ్రూపును ఏర్పాటు చేసుకుని ఇక్రిశాట్ ద్వారా ఏడాదిపాటు పల్లీ పట్టి తయారీ విధానంలో శిక్షణ పొందారు. ఐటీడీఏ శిక్షణ కూడా పూర్తిచేసుకుని ఈ యూనిట్లో తయారీని చేపట్టారు. ముందుగా పల్లీలను గ్రేడింగ్ చేసి శుభ్రం చేస్తారు. పల్లీలను వేయించిన అనంతరం పొట్టుతీస్తారు. మహారాష్ట్రలోని కొల్లాపూర్ నుంచి తెప్పించిన నాణ్యమైన బెల్లం, పంచదారతో కలిపి ఉడకబెడతారు. పల్లీలు ఉడికిన అనంతరం సీటింగ్ చేసిన తర్వాత 35 గ్రాముల సైజులో ముక్కలుగా కటింగ్ చేసి ప్యాకింగ్‌కు పంపుతారు. ఈ తయారీ విధానంలో నాణ్యత కలిగిన పదార్థ్ధాలనే వినియోగిస్తారు. ఇక్కడ రెండు విధాలుగా పల్లీ పట్టిని తయారుచేస్తారు. ఒకటి నువ్వుల పల్లీ పట్టి, రెండోది పుట్నాల పల్లీ పట్టి.
గ్రూపు సభ్యులు వీరే..
యూనిట్లో గ్రూపు సభ్యులే కీలకం. గ్రూపులో శ్యామల అర్చన, పూనెం గంగ, మర్మం సుజాత, కుంజా లక్ష్మి, తెల్లం నాగమ్మ, తెల్లం సీతమ్మ, పాయం నర్సీరత్నం, పూనెం దుర్గ, కుంజా అరుణ, జగిడి అర్జున్, కుర్సం మోహనరావు, కార్తీక్, పూనెం ఏడుకొండలు సభ్యులుగా ఉన్నారు.
నెలకు 3 వేల కిలోల పల్లీ పట్టి తయారీ..
ఈ యూనిట్లో నెలకు 3 వేల కిలోల పల్టీ పట్టి తయారు చేస్తున్నారు. తయారు చేసిన పట్టీని గిరిపోషణ పథకం కింద అందించి అక్కడి నుంచి వాటిని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. నెలకు 8 వేల కిలోలు తయారుచేసేలా సిద్ధమవుతున్నారు. అయితే జూన్ నుంచి గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలకు 6,400 కిలోల ఆర్డర్ ఉందని గ్రూపు సభ్యులు చెబుతున్నారు. ఈ యూనిట్‌ను భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు ఇటీవల సందర్శించి మెయింటినెన్స్ నిమిత్తం రూ.1.50 లక్షలను మంజూరు చేశారు. భవిష్యత్‌లో తయారీని మరింత పెంచుతామని సభ్యులు చెబుతున్నారు.
పల్లీ పట్టి యూనిట్‌తో స్వయం ఉపాధి..
పల్లీ పట్టి యూనిట్‌తో స్వయం ఉపాధి లభించింది. 13 మంది సభ్యులు గ్రూపుగా ఏర్పడి ఈ యూనిట్లో పల్లీ పట్టి తయారుచేసి ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నాం. పల్లీ పట్టీ తయారీతో తమకు 15 శాతం లాభాల వాటా రావడం ఎంతో ఆనందంగా ఉంది. మాకు సహకారం అందిస్తున్న ఐటీడీఏ అధికారుల మేలును ఎన్నటికీ మరువలేం.
-శ్యామల అర్చన, గ్రూపు సభ్యురాలు, చిన్నబండిరేవు
పల్లీ పట్టి తయారీలో శిక్షణ ఇచ్చాం
ఐటీడీఏ, ఇక్రిశాట్ సహకారంతో లక్ష్మీనగరంలో పల్లీపట్టి యూనిట్ ఏర్పాటు చేశారు. మహిళా సంఘం సభ్యులు, సిబ్బందికి పల్లీపట్టిల తయారీపై పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చాం. ఏడాదిపాటు శిక్షణను కొనసాగిస్తాం. సభ్యులకు పల్లీ పట్టి తయారీపై అవగాహన వచ్చింది. నాణ్యమైన పల్లీ పట్టిని తయారు చేస్తున్నారు. ఐటీడీఏ పీవో ఎప్పటికప్పుడు యూనిట్‌ను సందర్శిస్తూ సభ్యులతోపాటు సిబ్బందిని మానిటరింగ్ చేస్తున్నారు.
-లక్ష్మీకాంతారావు, టెక్నికల్ అసిస్టెంట్
ఆర్థిక ప్రగతి
లక్ష్మీనగరంలో ఐటీడీఏ సహకారంతో ఏర్పాటు చేసిన పల్లీ పట్టి యూనిట్‌తో స్వయం ఉపాధి లభించింది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. నాతోపాటు ఎంతో మంది మహిళలకు యూనిట్లో పనిదొరకడంతో వారంతా సంతోషంగా ఉన్నారు. ఐటీడీఏ ద్వారా మరెన్నో యూనిట్లు నెలకొల్పితే ఏజెన్సీలో అందరికీ స్వయం ఉపాధి లభిస్తుంది.
-లక్ష్మి, సభ్యురాలు, సూరారం