తిరుమలాయపాలెం, మే 6: తిరుమలాయపాలెం మండలంలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. కేశ్వాపురం వద్ద జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు కాల్వ తవ్వకం పనులను, తిప్పారెడ్డిగూడెం సమీపంలో ఆకేరుపై చేపట్టిన అక్విడెక్ట్ బ్రిడ్జీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పనులపై ప్రాజెక్టు అధికారులతో మాట్లాడారు. పనులను వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. లాండ్ కొనుగోలు పూర్తయిన ప్రాంతాల్లోనూ పనులను సమాంతరంగా చేపట్టాలని సూచించారు. ఇంకా ఎక్కడెక్కడి భూములకు పరిహారం చెల్లించాల్సి ఉందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఈ శంకర్‌నాయక్, ఎస్ఈ రవికుమార్, ఈఈ సమ్మిరెడ్డి, డీఈ బాణాల రమేశ్‌రెడ్డి, తహసీల్దారు పుల్లయ్య ఎంపీపీ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
‘మన బడి’ పనుల పరిశీలన..
తిరుమలాయపాలెం, పిండిప్రోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాల్లో ‘మన ఊరు – మన బడి’ పనులను కలెక్టర్ పరిశీలించారు. అవసరమైన పనులకు మాత్రమే నిధులను వెచ్చించాలని ఎస్ఎంసీ చైర్మన్లకు, హెచ్ఎంలకు సూచించారు. పిండిప్రోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కనే కొందరు బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారని స్థానికులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన..
తిరుమలాయపాలెం ప్రభుత్వ ఆసుపత్రిని సైతం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అపరిశుభ్రతను గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యాధికారులు, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని కొంతమంది కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ విషయమై కలెక్టర్ వైధ్యాధికారులు, సిబ్బందితో సమావేశమై.. సక్రమంగా పనిచేయని వైద్యాధికారులు సిబందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధి కూలీలకు వసతులపై ఆరా..
కేశ్వాపురంలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలతో కలెక్టర్ మాట్లాడారు. పనులకు ఉదయం త్వరగా వెళ్లి బాగా ఎండరాక ముందే ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. పనుల వద్ద కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. చేసిన పనులకు ఇంకా వేతనాలు రాలేదని కూలీలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఇంటర్ పరీక్షల పరిశీలన..
పిండిప్రోలు కళాశాల్లో జరుగుతున్న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను కలెక్టర్ పరిశీలించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.