కొత్తగూడెం అర్బన్, మే 6:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమంలో మొక్కలను నాటడంతోపాటు పట్టణాల్లో కృత్రిమ అడవులను పెంచుతోంది. ‘హరితహారం’లో రోడ్డు వెంట, ఖాళీ ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి, వాటి పెరుగుదల కోసం ప్రత్యేక సంరక్షణ చర్యలను చేపట్టారు. హరితహారం నిర్వహణలో భాగంగా ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో మొక్కలను పెంచడంతోపాటు మున్సిపాలిటీ ప్రతి వార్డులోనూ ఒక ప్రకృతి వనాన్ని, అదే విధంగా ఒక ఎకరం స్థలంలో చిట్టడవిని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మున్సిపల్ అధికారులు వెనువెంటనే ఎకరం స్థలాన్ని గుర్తించి అందులో మొక్కలు నాటారు. అదే.. పట్టణ ప్రకృతి వనం (చిట్టడవి). ప్రస్తుతం వీటిల్లో మొక్కలు ఏపుగా పెరిగి పట్టణ వాసులకు ఆహ్లాదాన్నిస్తున్నాయి. స్వచ్ఛమైన గాలిని, ప్రశాంత వాతావరణాన్ని అందిస్తున్నాయి.
పట్టణంలో కృత్రిమ అడవులు..
పట్టణాల్లో పరిశ్రమలు, పట్టణీకరణ పెరిగే క్రమంలో వాణిజ్య సముదాయలు ఏర్పడడం వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతుంది. దీన్ని అరికట్టాలంటే విరివిగా మొక్కలను నాటాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. పట్టణాల్లో ఎకరం ఖాళీ స్థలం ఉంటే అందులో మొక్కలను పెంచి భవిష్యత్‌లో చిట్టడవులను తలపించే విధంగా కృత్రిమ అడవులను తయారు చేయాలని నిర్ణయించింది. దీంతో మున్సిపల్ అధికారులు ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన స్థలాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు నీళ్లు పడుతున్నారు. మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లు ప్రతీ వారం ఈ మొక్కల పెరుగుదలను పర్యవేక్షిస్తున్నారు.
పల్లె ప్రకృతివనాలు..
ప్రతీ మున్సిపాలిటీలో చిట్టడవులతోపాటు పల్లె ప్రకృతి వనాలనూ అధికారులు పెంచుతున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 10, పాల్వంచలో 17, ఇల్లెందులో 19, మణుగూరులో 9 ఏర్పాటు చేశారు. వార్డు ప్రజలకు స్వచ్ఛమైన గాలితోపాటు ఆహ్లాదాన్ని పంచేలా చర్యలు చేపట్టారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన పల్లె, పట్టణ ప్రకృతి వనాలకు ప్రత్యేక నిధులను కేటాయించి ఓపెన్ జిమ్‌లను సైతం ఏర్పాటు చేశారు. అటు ఆరోగ్యాన్ని, ఇటు ఆహ్లాదాన్ని పంచే విధంగా తీర్చిదిద్దారు. ప్రతీ పల్లె ప్రకృతి వనంలో సుమారు 250పైగా వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. వీటి పర్యవేక్షణకు మున్సిపాలిటీ సిబ్బందిని నియమించారు.
వెయ్యి రకాల మొక్కలు..
పట్టణ ప్రకృతి వనాలను ప్రతి మున్సిపాలిటీలోనూ ఏర్పాటు చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో రాజీవ్ పార్కు సమీపంలోని టీఎన్జీవోస్ కాలనీ 20 కుంటల విస్తీర్ణంలో, పాల్వంచ శ్రీనివాసకాలనీలో ఎకరం విస్తీర్ణంలో, మణుగూరు రాజుపేటలో ఎకరం, శేషగిరినగర్‌లో పది ఎకరాల విస్తీర్ణంలో, ఇల్లెందు ఆర్అండ్ఆర్ కాలనీలో మూడు ఎకరాలు, గురువారెడ్డి కాంప్లెక్స్ ఏరియాలో మరో మూడు ఎకరాల విస్తీర్ణాల్లో పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ప్రతీ చిట్టడవిలో సుమారు ఐదువేలకుపైగా మొక్కలను వరుస క్రమంలో నాటి పెంచారు. భవిష్యత్‌లో ఇవి పట్టణానికే తలమానికంగా మారి ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని పంచనున్నాయి.
మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎకరం స్థలంలో చిట్టడవిని ఏర్పాటు చేశాం. ఇందులో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నాం. మొక్కల పెరుగుదల కోసం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాం. పట్టణాలు కాంక్రీట్ జంగిల్‌ను తలపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మున్సిపాలిటీలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనివల్ల ప్రజలకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఆహ్లాదమూ కలుగుతుంది. మొక్కలకు ప్రతిరోజూ నీళ్లు పట్టేందుకు సిబ్బందిని నియమించాం.
-తోటమల్ల నవీన్‌కుమార్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్