ఖమ్మం వ్యవసాయం, మే 6: వానకాలం సీజన్‌కు సంబంధించిన విత్తన క్రయవిక్రయాలను పట్టిష్టంగా, పారదర్శకంగా జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఇన్చార్జి డీఏవో సరిత తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏడీఏ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక నుంచి ప్రతి విత్తనపు గింజనూ ఆన్లైన్ ద్వారా విక్రయించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించిందన్నారు. సీజన్‌కు ముందుగానే రైతులు పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకోవాలని సూచించారు. ఇందుకు గాను జిల్లాకు 31,897 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువులు కేటాయించినట్లు చెప్పారు. జీలుగు విత్తనాలు 27,397 క్వింటాళ్లు, జనుము విత్తనాలు 1,500 క్వింటాళ్లు, పిల్లి పెసర విత్తనాలు మరో 3వేల క్వింటాళ్లు కేటాయించినట్లు వివరించారు. కొద్ది రోజుల్లోనే పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఏవో టెక్నికల్ అధికారులు రాజు, వినయ్ పాల్గొన్నారు.