భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం వ్యవసాయం, మే 6: శుక్రవారం ఉదయం నుంచి ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. వెనువెంటనే భారీ గాలి దుమారం ప్రారంభమైంది. దీంతో కొనుగోలు కేంద్రాల దగ్గరకు ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు ఆందోళనకు గురయ్యారు. ఖమ్మంలో వీచిన బలమైన గాలుల వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పలు మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ప్రధాన రహదారుల వెంట ఉన్న చెట్లు నేలకొరిగాయి.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి జిల్లాలోనూ శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులుతో కూడిన వర్షం కురిసింది. టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో గుడిసెలు కూలిపోయాయి. ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. టేకులపల్లి మండలంలో గాలి దుమారానికి చెట్టు కూలిపడడంతో దుక్కిటెద్దు మృతిచెందింది. అన్నపురెడ్డిపల్లిలో రైతుల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. యాసంగి కోతకు రాని వరిపంట నేలకొరిగింది.