ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 6: ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. తొలిరోజు ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు/ సంస్కృతం) పరీక్ష జరిగింది. ‘ఏ’ సెట్ ప్రశ్నపత్రం ఎంపికైంది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 16,872 మంది (జనరల్ విభాగంలో 14,433 మంది, ఒకేషనల్ విభాగంలో 2,439 మంది) విద్యార్థులకు 746 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 59 కేంద్రాలు పరీక్షల నిర్వహణకు ఏర్పాటయ్యాయి.
పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్, ఆర్డీవో రవీంద్రనాథ్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఖమ్మం నగరంలోని శ్రీచైతన్య పరీక్షా కేంద్రానికి ఓ విద్యార్థిని ఆలస్యంగా రాగా ఆమెను పరీక్ష రాయడానికి అనుమతించలేదు. విద్యార్థినికి అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, డీఐఈవో రవిబాబు సదరు విద్యార్థినికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సప్లమెంటరీలో పరీక్ష రాయవచ్చన్నారు. ఆందోళన చెందవద్దన్నారు. మిగిలిన పరీక్షలపై దృష్టి సారించాలన్నారు. డీఈసీ సభ్యులు తొమ్మిది కేంద్రాలు, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఆరు, సిట్టింగ్ స్కాడ్ బృందాలు ఎనిమిది, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు 19, హైపవర్ కమిటీ బృందాలు తొమ్మిది కేంద్రాలను తనిఖీ చేశాయి. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.
జిల్లావ్యాప్తంగా 10,215 మంది (జనరల్ విభాగంలో 7,807 మంది, ఒకేషనల్ విభాగంలో 2,408) పరీక్ష రాయాల్సి ఉండగా తొలిరోజు 956 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సులోచనారాణి జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల బాధ్యులు ఏర్పాట్లు చేశారు. ఎండల దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. ప్రతి కేంద్రం వద్ద నిమిషం ఆలస్యం నిబంధన అమలైంది. పోలీస్ స్టేషన్ల నుంచి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ చీఫ్ సూరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు ప్రశ్నాపత్రాలను తరలించారు.