ఖమ్మం, అక్టోబర్ 20 : గోల్లపాడు చానల్ ఆధునీకరణ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలో ఆహ్లాదకరమైన త్రీటౌన్ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలు చూడబోతున్నారని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం మంత్రి నగరంలోని త్రీటౌన్ పరిధిలో చేపడుతున్న గోళ్లపాడు చానల్ ఆధునీకరణ పనులను కలెక్టర్ వీపీ గౌతమ్, కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి పర్యవేక్షించారు. ప్రకాశ్‌నగర్, రంగనాయకుల గుట్ట, దర్గా, సుందరయ్య పార్క్, పిల్లి కృష్ణవారి తోట, కాల్వొడ్డు, ట్రంక్‌రోడ్డు ప్రాంతాల్లో పర్యటించి కెనాల్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆధునీరకణ పనుల్లో భాగంగా పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పంపింగ్‌వెల్ రోడ్డు, రంగనాయకుల గుట్ట, సుందరయ్య పార్క్ ప్రాంతాల్లో ఐదు పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాక ఓపెన్‌జిమ్, వాకింగ్ ట్రాక్‌లు, ఫౌంటేన్లు, క్రీడలకు సంబంధించిన కోర్టులు ఏర్పాటు కానున్నాయన్నారు. మురికినీటి డ్రైయిన్స్ 92శాతం, అండర్ గ్రౌండ్ 99శాతం పూర్తయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి స్థానికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ మేదరమెట్ల శైలజ తదితరులు పాల్గొన్నారు.