ములకలపల్లి, అక్టోబర్ 19 : క్షణికావేశంలో ఓ తల్లి తన రెండేళ్ల కుమార్తెకు పురుగుమందు తాగించి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… కొయ్యల అనూష(25) పుట్టింటికి వెళ్తానని తన భర్త మల్లయ్యను కోరగా తాను జ్వరం, విరేచనాలతో బాధపడుతున్నానని.. ఈ సమయంలో తనను ఒంటరిగా విడిచి పుట్టింటికి ఎలా వెళ్తావని అనడంతో మనస్తాపానికి గురైన అనూష క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుమందును తన రెండేళ్ల కుమార్తె నక్షత్రకు తాగించి ఆ తర్వాత తాను కూడా తాగింది.
ఇది గమనించిన భర్త మల్లయ్య వెంటనే భార్య, కూతురిని ఆటోలో ములకలపల్లి పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించాడు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పాల్వంచ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. అందరితో కలివిడిగా ఉండే అనూష క్షణికావేశంలో తన రెండేళ్ల చిన్నారి నక్షత్రతో కలిసి ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లీకూతురు ఒకేసారి మృతిచెందడంతో ఆ దృశ్యాన్ని చూసిన కాలనీవాసులు కన్నీరుమున్నీరయ్యారు.