సుజాతనగర్, అక్టోబర్ 13 : సీతాఫలం.. పేరు వినగానే చిన్నపిల్లాడి నుంచి పండు ముసలి వరకు నోరూరుతుంది. సహజ సిద్ధంగా లభించే తియ్యని సీతాఫలాలు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి. చలికాలం ప్రారంభం కాగానే విరివిగా లభించే మధురమైన ఫలం సీతాఫలం. అమృత ఫలాన్ని తలపించే సీతాఫలాన్ని కస్టర్డ్ యాపిల్, షుగర్ యాపిల్ అనే పేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం సీతాఫలాల సీజన్ ప్రారంభమైంది. చూడటానికి అందంగా ఉండి నోరూరించే సీతాఫలం రుచిలోనే కాదు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది సహజ సిద్ధంగా చలికాలంలో మాత్రమే లభించే సీతాఫలాలకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది. సీతాఫలంలో విటమిన్ ఏ, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బీ, కాల్షియం, విటమిన్ సీ, ఐరన్ తదితర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉండటంతో కంటి సమస్యలు దూరమవుతాయి. మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఉండడంతో గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. అల్సర్ గ్యాస్, మలబద్దకం, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. క్యాన్సర్ నిరోధకంగా కూడా ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు. దీనిలో పోషక విలువలు చాలా ఉన్నాయి. 100 గ్రాములు గుజ్జు నుంచి 84 క్యాలరీల శక్తి 20 నుంచి 25 గ్రాముల పిండి పదార్థాలు, 2.5 గ్రాముల ప్రోటీన్లు, 4.4 గ్రాముల పీచు లభ్యమవుతుంది. మాంసకృత్తులు 0.8 నుంచి 1.5 గ్రాములు చక్కెర గ్లూకోజ్ రూపంలో 20 నుంచి 22 కొవ్వు పదార్థాలు 0.30 కాల్షియం, 0.02 ఐరన్, 1.00 పోషక విలువలు ఉండటంతో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా కెరోటిన్ డైమిన్ లాంటివి సమృద్ధిగా లభిస్తాయి.
సీతాఫలాల ధరలు ఈ ఏడాది ఒకింత ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి పండ్లు వస్తుండడంతో ధర అధికంగా పలుకుతున్నాయి. పరిమాణం బట్టి 20 నుంచి 30 వరకు విక్రయిస్తున్నారు. సీజన్లో మాత్రమే లభించే సీతాఫలాల ధర ఎంతైనప్పటికీ ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు. అక్టోబర్ చివరివారం నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే పండ్లు ఈ సారి 15రోజుల ముందుగానే వచ్చాయి. గత ఏడాది అక్టోబర్లో సీతాఫలాలు నాణ్యత సైజు మేరకు డజన్ వంద నుంచి రూ.150 మధ్య లభించాయి.
జిల్లాలోని ఆయా గ్రామాల నుంచి కొంతమంది మహిళలు సీతాఫలాలను పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చి నిత్యం ఉపాధి పొందుతున్నారు. అటవీ ప్రాంతంతో పాటు పొలాల నుంచి ఉదయాన్నే జిల్లా కేంద్రాల్లోని రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు., ఉదయం నుంచి సాయంత్రం వరకు సీతాఫలాలు విక్రయాలతో రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు ఆదాయం పొందుతున్నారు.